కష్టకాలంలో మనతో నడిచేవారే మనవారు
‘కార్యకర్తలను వేధిస్తే సహించను.. కంటికి రెప్పలా కాపాడుకుంటా’
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం
‘ఎస్ఐఆర్’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని సూచన
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు
కాకతీయ, హనుమకొండ : “కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి, మనతో కలిసి నడిచే వారే నిజమైన మనవారు. పార్టీని వదిలి వెళ్లిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాడు ఉద్యమ కాలం నుంచి నేటి వరకు నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలను రాబోయే రోజుల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటా” అని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. హనుమకొండ కాపువాడలోని మాతా గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన 7, 10 డివిజన్ల బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పులి రజినీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. “ప్రజా సమస్యలపై పోరాడుతున్న మన కార్యకర్తలపై, నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ఇలాంటి కేసులు మాకేమీ కొత్త కాదు. కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోం. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీలోకి కొత్త రక్తం చేరుతోంది, శ్రేణులంతా మరింత ఉత్సాహంతో పనిచేయాలి. ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ఓటరు మ్యాపింగ్ చేపట్టాలి. నిరంతరం క్షేత్రస్థాయిలో ఓటర్లకు అందుబాటులో ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ అవినీతిని, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ గారి ప్రజాపాలన తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కదంతొక్కాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉడుతల సారంగపాణి, సీనియర్ నాయకులు నాయీముద్దీన్, కొండ శ్రీనివాస్, ఎండి ఖలీల్, హైమావతి, సుదర్శన్, ఈశ్వర్, పొదిలి అనిల్, వరుణ్, సుధాకర్, డివిజన్ ఇన్‌చార్జీలు విజయ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

