రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చందుర్తి మండలం కట్ట లింగంపేట గ్రామానికి చెందిన ఎల్లా శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశమైన మస్కట్‌లో పనిచేస్తూ ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలో తన సామాన్లు తీసుకున్న అనంతరం తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన కట్ట లింగంపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో రుద్రంగి మెయిన్ రోడ్డుపై ఉన్న డివైడర్‌ను శ్రీనివాస్ ప్రయాణిస్తున్న బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రుద్రంగి ఎస్సై మోతీరాం తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రుద్రంగి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి, ఇటీవలే కళ్లముందుకు వచ్చిన యజమాని ఇలా రోడ్డు ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్లడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో కట్ట లింగంపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

