2027 నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ పూర్తి
కుంగిపోయిన బ్యారేజీపై లోతైన అధ్యయనం
ప్రపంచ స్థాయి నిపుణులతో రీడిజైన్ ప్రక్రియ
రాజకీయ దురుద్దేశం లేదు.. ప్రాజెక్టును వినియోగంలోకి తేవడమే లక్ష్యం
2027 ఎండాకాలం నాటికి పూర్తి లక్ష్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మేడిగడ్డలో సాంకేతిక పరీక్షల పరిశీలన
కాకతీయ, మల్హర్/మేడిగడ్డ : మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను 2027 నాటికి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరుగుతున్న సాంకేతిక పరీక్షల పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో చేపట్టిందని, అప్పటికే దాదాపు రూ.11 వేల కోట్ల పనులు పూర్తై 30 శాతం పురోగతి సాధించిందని మంత్రి గుర్తు చేశారు. అయితే 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టు రూపురేఖలను మార్చి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు తప్పుడు నిర్ణయాలు, లోపభూయిష్ట నిర్మాణం కారణంగా సమస్యల్లో చిక్కుకుందని విమర్శించారు.

కుంగిపోయిన బ్యారేజీపై లోతైన అధ్యయనం
దాదాపు రూ.1.45 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూడడం లేదని, సాంకేతికంగా పటిష్టమైన పరీక్షల ఆధారంగా పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనులు కూడా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మేడిగడ్డ పునరుద్ధరణ కోసం ప్రపంచ ప్రఖ్యాత “ఆఫ్రిన్” కన్సల్టెన్సీ సంస్థను నియమించి, ఐఐటీ బాంబే నిపుణులతో కలిసి రీడిజైన్ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. జూన్ చివరి నాటికి లేదా జూలై తొలి వారంలో అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తవుతాయని, ఆ నివేదికల ఆధారంగా తుది డిజైన్ రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ అనుమతులు తీసుకుని వర్షాకాలం అనంతరం నవంబర్-డిసెంబర్ నెలల్లో పునరుద్ధరణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
2027 ఎండాకాలం నాటికి పూర్తి లక్ష్యం
ఒకే వర్కింగ్ సీజన్లో ప్రధాన పనులు పూర్తి చేసి 2027 ఎండాకాలం నాటికి మేడిగడ్డ బ్యారేజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. భారత సైన్యంలో అత్యంత అనుభవం కలిగిన కల్నల్ పరిషిత్ మెహ్రా ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. దేశ, విదేశాల నిపుణుల సూచనలతో సాంకేతిక పరిశీలనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్ గుప్తా, ఆర్డీఓ రవీందర్, ఎస్ఈ దస్తగిరి, ఈఈ రమేష్, కన్సల్టెంట్ ఈఈ యాదగిరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

