జార కాలనీ శివారులో గంజాయి గుట్టురట్టు
మాటువేసి ముగ్గురిని పట్టుకున్న పోలీసులు
23 గ్రాముల గంజాయి, వాహనాలు స్వాధీనం
కాకతీయ, ఏటూరునాగారం: నూగూరు వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ శివారులోని జామాయిల్ తోటను గంజాయి సేవనానికి అడ్డాగా మార్చుకున్న ముగ్గురు వ్యక్తులను వెంకటాపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై కే. తిరుపతిరావుకు అందిన ముందస్తు సమాచారంతో, ఆయన తన సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం అక్కడ మాటువేశారు. నిందితులు ఒక ఆటో, ఒక ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా అక్కడికి చేరుకోగా, పోలీసులు వారిని అడ్డగించి తనిఖీలు నిర్వహించారు. విచారణలో నిందితులను మంచిర్ల అనిల్‌కుమార్ (35), కురుసం సంతోష్‌కుమార్ (32), ఉయికే సురేష్ (32)లుగా గుర్తించారు. పంచుల సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద నుంచి 23 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 1,150 ఉంటుందని అధికారులు తెలిపారు. గంజాయి సేవనానికి ఉపయోగించిన ఒక ఆటో, ఒక మోటార్‌సైకిల్‌ను సీజ్ చేసినట్లు వెంకటాపురం సీఐ వెల్లడించారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

