అన్ని రంగాల్లో రేవంత్ సర్కార్ వైఫల్యం
రైతు బంధును..రాహుల్ బంధుకు మళ్లించారు
ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
ప్రజలు, కార్యకర్తలే బీఆర్ఎస్ బలం
ప్రాణం ఉన్నంతవరకు సిరిసిల్ల అభివృద్ధి నా ధ్యేయం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రభుత్వ తొలి అంకం పూర్తిగా నిరాశపరిచిందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయితే సెకండ్ హాఫ్‌పై ఎలాంటి ఆశలు ఉండవో, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

రైతు బంధును రాహుల్ బంధుగా మార్చారు
రైతుబంధు పథకాన్ని బలహీనపరిచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు మళ్లీ దుకాణాల వద్ద క్యూల్లో నిలబడే పరిస్థితి వచ్చిందని, ధాన్యం కొనుగోళ్లలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. రైతుబంధును బలహీనపరిచి రాహుల్ బంధుగా మార్చారని, తెలంగాణ డబ్బు ఇతర ప్రాంతాలకు తరలిపోతోందని విమర్శించారు. హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి నుంచి ప్రజలు ఇంకేం ఆశించలేరని, ముఖ్యమంత్రికి మాటలు ఎక్కువ, పనులు తక్కువగా ఉన్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, సంక్షేమ పథకాలతో గత భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిందని పేర్కొన్నారు. సిరిసిల్లతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, రాజకీయంగా తనకు పునర్జన్మ ఇచ్చింది సిరిసిల్ల ప్రజలేనని భావోద్వేగంగా చెప్పారు. తన జీవితాంతం సిరిసిల్ల అభివృద్ధికే కృషి చేస్తానని స్పష్టం చేశారు. అధికారం లేకపోయినా ప్రజల ఆదరణ పార్టీకి ఏమాత్రం తగ్గలేదని, ప్రజల సహకారంతో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
డిజిటల్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి
ఈ సందర్భంగా పార్టీ చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

