రక్తదాన అవార్డుల్లో హన్మకొండ జిల్లాకు 8 అవార్డులు
స్వచ్ఛంద రక్తదానం, సేకరణలో జిల్లా రెడ్ క్రాస్ ప్రతిభ
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లా రెడ్ క్రాస్ రక్త కేంద్రం
పలు విద్యాసంస్థలు, పోలీసు కమిషనరేట్, స్వచ్ఛంద దాతలకు పురస్కారాలు
కాకతీయ, హనుమకొండ : ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన రాష్ట్ర స్థాయి రక్తదాన అవార్డుల్లో హనుమకొండ జిల్లా 8 అవార్డులు కైవసం చేసుకుంది. స్వచ్ఛంద రక్తదానం, రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్త సేకరణలో విశిష్ట సేవలకు ఈ గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి. విజయ్ చందర్ రెడ్డి అవార్డులను అందుకున్నారు. హనుమకొండ రెడ్ క్రాస్ రక్త కేంద్రం అత్యధిక రక్త సేకరణ చేసిన రక్తకేంద్రం విభాగంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఎస్ఆర్ యూనివర్శిటీ, కిట్స్, వాగ్దేవి విద్యాసంస్థలు, వరంగల్ పోలీస్ కమిషనరేట్, డాఫొడిల్స్ స్కూల్‌తో పాటు స్వచ్ఛంద రక్తదాతలు జి. రామకృష్ణ, బి. శిరీష్ కుమార్ రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. జిల్లాకు 8 అవార్డులు రావడం గర్వకారణమని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొంటూ, భవిష్యత్తులో హనుమకొండ రెడ్ క్రాస్ రక్తకేంద్రాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు.

