హరీష్ రావు పర్యటన ఫ్లెక్సీల ధ్వంసం
వరంగల్ పశ్చిమలో రాజకీయ వేడి
ముందస్తు కుట్రతోనే ఫ్లెక్సీల చింపివేత
ప్రజాభిమానాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరు
మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్ని రేపింది. తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపివేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో హరీష్ రావు పర్యటనకు నగరం వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం తెల్లవారుజామున సుబేదారి కాకతీయ యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే అధికార పార్టీకి చెందిన కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయి
ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమేనని, కానీ ప్రత్యర్థి పార్టీల ప్రచార సామగ్రిపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఆస్తుల ధ్వంసం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇటువంటి చర్యలు ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచుతాయని హెచ్చరించారు. ఫ్లెక్సీలను చింపినంత మాత్రాన హరీష్ రావు, వినయ్ భాస్కర్‌లపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరపలేరని స్పష్టం చేశారు. ఫ్లెక్సీల ధ్వంసానికి బాధ్యులైన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టాలని కోరారు. ఈ ఘటనతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో ప్రజలే వీటికి తగిన సమాధానం చెబుతారని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి.

