సింగరేణిలో రూ.1,600 కోట్ల కుంభకోణం
అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి
నిధుల మళ్లింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఈ వ్యవహారాన్ని ప్రధాని, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తా
బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి
కాకతీయ, ఖమ్మం : సింగరేణి కాలరీస్ సంస్థలో చోటుచేసుకున్న భారీ నిధుల గల్లంతు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణిలో సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమై, తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1,600 కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన క్వార్టర్ల నిర్మాణం, సైలో బంకర్ల ఏర్పాటు, గనుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిష్పాక్షిక విచారణకు ఆదేశించి, తమ ప్రభుత్వ పారదర్శకతను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
నిధుల మళ్లింపుపై శ్వేతపత్రం కావాలి
కేవలం బొగ్గు నిల్వలలోనే కాకుండా, సింగరేణి సీఎస్ఆర్ మరియు డీఎంఎఫ్ నిధుల వినియోగంలోనూ భారీ స్థాయిలో గోల్మాల్ జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఈ నిధులను ఏయే ప్రాజెక్టులకు ఖర్చు చేశారు, ఎక్కడికి మళ్లించారో ప్రభుత్వం పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల కష్టంతో సమకూరిన ప్రజా సంపదను కొందరు స్వార్థపరులు దోచుకుంటున్నారని, దీన్ని చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి, సింగరేణిలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరనున్నట్లు సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ కుంభకోణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పట్టుబట్టారు.

