మిడ్‌డే మీల్‌లో అవకతవకలపై ఫిర్యాదు
కోర్టు కేసు వివరాలు వెల్లడించాలని డిమాండ్
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దు
పదేళ్ల వివాదానికి శాశ్వత పరిష్కారం కావాలంటూ గ్రీవెన్స్‌లో దరఖాస్తు
కాకతీయ, చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించి గత పదేళ్లుగా కొనసాగుతున్న వివాదంపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు, సమాఖ్య సంఘాల నాయకురాళ్లు కోరారు. ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా గ్రామ పంచాయతీ, వివిధ సంఘాల ప్రతినిధులు సమావేశమై స్థానిక మహిళల చేత వంట బాధ్యతలు నిర్వహించాలని గతంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఒక బృందం న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ, కేసు వివరాలు, తీర్పు ప్రతులు, కోర్టు నుంచి వచ్చిన లేఖలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జయప్రద,గ్రామస్తులకు వెల్లడించడం లేదని ఆరోపించారు. పలు మార్లు వివరణ కోరినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అసలు గ్రూపు సభ్యుల పేర్ల స్థానంలో ఇతరుల పేర్లు నమోదు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, సమైక్య సంఘాల నాయకులు, గ్రామస్తులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పేర్ల మార్పులు జరిగి ఉంటే వాటికి బాధ్యులు ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజన నిర్వహణలో ఉన్న నిర్వాహకులను తొలగించి అర్హత కలిగిన కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో ప్రశాంత వాతావరణం నెలకొని విద్యార్థుల విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మారెళ్ల లక్ష్మి, కముటం లీల, బురికి భాగ్యలక్ష్మి, మారెళ్ల అనూష, బురికి స్వరూప తదితరులు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు సమర్పించారు. కోర్టు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామ పంచాయతీ, గ్రామస్తులకు అందుబాటులో ఉంచడంతో పాటు వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. గ్రామస్తుల ఫిర్యాదుపై జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

