బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు
ములుగు పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
బాధిత బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం అందజేయాలని ఆదేశం
నేరస్తుడికి రూ. 20 వేల జరిమానా విధింపు
కాకతీయ, ఏటూరునాగారం : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ములుగు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. 2023లో మంగపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్రకళ నిందితుడు కన్నెబోయిన సమ్మయ్య (35) దోషి అని నిర్ధారించారు. శిక్షతో పాటు నిందితుడికి రూ. 20 వేల జరిమానా, బాధితురాలికి రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. కమలాపురం గ్రామానికి చెందిన నిందితుడు సమ్మయ్యపై అత్యాచారం, అపహరణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మరియు పోక్సో చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పోలీసులు పక్కా సాక్ష్యాలతో ఛార్జిషీటు దాఖలు చేయడంతో నిందితుడికి శిక్ష పడింది. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన దర్యాప్తు అధికారి సిరిశెట్టి సంకీర్త్, డీఎస్పీ కిషోర్ కుమార్, ఎస్ఐ నాగరాజు, కోర్టు సీడీఓ మౌనికను జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అభినందించారు. మైనర్ బాలలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

