గురునాథం చెరువులో ‘ఇసుక’ దోపిడీ
నిబంధనలకు పాతర.. జేసీబీలతో అక్రమ తవ్వకాలు
సహజ వనరుల విధ్వంసం.. భూగర్భ జలాలపై పెను ప్రభావం
అక్రమార్కుల కనుసన్నల్లో ఇసుక రవాణా
నిమ్మకునీరెత్తినట్లుగా అధికారులు.. పట్టించుకోని అధికార యంత్రాంగం!
కాకతీయ, చందుర్తి : కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామ పరిధిలోని గురునాధం చెరువు అక్రమార్కుల అడ్డాగా మారుతోంది. అనుమతులు లేకపోయినా, ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేసీబీలతో చెరువును తవ్వుతూ, గుర్తు తెలియని వాహనాల్లో ఇసుకను తరలిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెరువులు, కుంటల నుంచి ఇసుకను అక్రమంగా తరలించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా, భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలకు కఠినమైన నిబంధనలు ఉండగా, గురునాధం చెరువు వద్ద జరుగుతున్న ఈ తవ్వకాలు చూస్తుంటే అధికార యంత్రాంగం పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని స్పష్టమవుతోంది.
ఎవరి అండతో ఈ దందా?
గ్రామస్థుల సమాచారం మేరకు, జేసీబీ సహాయంతో ఇసుకను లోడ్ చేసి, అర్ధరాత్రి వేళల్లో వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా వెనుక ఎవరున్నారన్నది స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారుల సమాచారం లేకుండా ఇటువంటి భారీ తవ్వకాలు సాధ్యం కావని, దీని వెనుక ఏదో పెద్ద గొడవ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ప్రకృతిని నాశనం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే స్పందించాలి.. అక్రమాలకు చెక్ పెట్టాలి. రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ జరపాలి. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న వాహనాలను, జేసీబీలను సీజ్ చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, చెరువును కాపాడేలా తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రకృతిని దోచుకుంటున్న వారిని వదిలేస్తే, భవిష్యత్తులో గురునాధం చెరువు అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ప్రజా నిరసన తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్ర వీడి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

