అవినీతి ‘ఖాకీ’లపై సీపీ కొరడా
కమిషరేట్‌లో కొనసాగుతున్న ప్రక్షాళన
డేగ కళ్లతో..వివిధ మార్గాల్లో సమాచారణ సేకరణ
నివేదికల ఆధారంగా కఠిన నిర్ణయాల అమలు
ఏఆర్‌కు ఇటీవల ధర్మసాగర్ సీఐ శ్రీధర్‌రావు
తాజాగా నర్మెట్ట సీఐ అబ్బయ్య, ఎస్ఐ హమీద్‌లపై వేటు
అవినీతిపరులకు సహించేది లేదని సీపీ హెచ్చరిక
పారదర్శక పాలనపై పోలీస్ బాస్ ప్రత్యేక నిఘా
కాకతీయ,వరంగల్‌బ్యూరో : పోలీస్ శాఖలో అవినీతికి, అక్రమాలకు ఏమాత్రం తావులేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మరోసారి తన రాజీలేని వైఖరిని చాటిచెప్పారు. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కొరడా ఝుళిపించారు. కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. అబ్బయ్యతో పాటు, గతంలో బచ్చన్నపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్‌లో ఉన్న షేక్ హమీద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నివేదికల ఆధారంగా కఠిన నిర్ణయం
ఈ ఇద్దరు అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను సీపీ అత్యంత సీరియస్‌గా పరిగణించారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించగా, ఆరోపణలు నిజమని ప్రాథమిక ఆధారాలు లభించాయి. శాఖా పరమైన నిబంధనలను ఉల్లంఘించి, ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలడంతో.. తక్షణమే వారిని సస్పెండ్ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరించే ఎంతటి అధికారిపైనా చర్యలు ఉంటాయని ఈ నిర్ణయం ద్వారా ఆయన స్పష్టం చేశారు.
కొనసాగుతున్న ప్రక్షాళన..
వరంగల్ కమిషనరేట్‌లో గత కొంతకాలంగా ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల ధర్మసాగర్ సీఐ శ్రీధర్‌రావును ఆరోపణల నేపథ్యంలో ఏఆర్‌కు అటాచ్ చేయడంతో పాటు, పలువురు ఎస్ఐలను బదిలీ చేయడం ద్వారా పరిపాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించడం, విజిలెన్స్ నివేదికల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవడం వంటి విధానాలను సీపీ సన్‌ప్రీత్ సింగ్ అమలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణలను, ప్రజల నుంచి నేరుగా వచ్చే ఫిర్యాదులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు.
సిబ్బందికి స్పష్టమైన సందేశం
తాజా సస్పెన్షన్ల నేపథ్యంలో, కమిషనరేట్‌లోని సిబ్బందికి సీపీ సన్‌ప్రీత్ సింగ్ గట్టి సంకేతాలు పంపారు. పోలీస్ శాఖ అంటేనే ప్రజలకు రక్షణ, భరోసా అని, ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలు ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అక్రమ వసూళ్లు, అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే హోదాతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. నిజాయితీగా, జవాబుదారీతనంతో పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తూనే, అక్రమాలకు పాల్పడే వారిని శాఖ నుంచి తొలగించే దిశగా సీపీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన పనితీరును పెంచుతాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

