లైంగిక దాడుల బాధితులకు సత్వర న్యాయం జరగాలి
బాధితుల గోప్యత, గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి
అన్ని శాఖల సమన్వయం అత్యంత కీలకం
‘భరోసా’ కేంద్రాల సేవలపై వరంగల్ సీపీ శ్వేత సమీక్ష
పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశం
కాకతీయ, హనుమకొండ : లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం అందించేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత స్పష్టం చేశారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బాధితులకు రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలను వేగంగా అందించడంలో ‘భరోసా’ కేంద్రాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. వరంగల్, జనగామ జిల్లాల్లోని భరోసా కేంద్రాల పనితీరును సమీక్షించిన సీపీ, కేసు నమోదు నుంచి దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ ఎక్కడా జాప్యం జరగకూడదని ఆదేశించారు. బాధితుల గౌరవాన్ని, గోప్యతను కాపాడటం ప్రతి అధికారి బాధ్యత అని, ప్రతి కేసును అత్యంత సున్నితంగా విచారించాలని సూచించారు. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం వంటివన్నీ ఒకే వేదికపై అందేలా భరోసా కేంద్రం ద్వారా సేవలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని తెలిపారు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, బాధితులకు భరోసా కల్పించే దిశగా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సీపీ శ్వేత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో భరోసా కేంద్రం అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

