పాత కేసుల పరిష్కారంలో వేగం పెంచండి
చేర్యాల కోర్టులో జిల్లా జడ్జి కీలక ఆదేశాలు
న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచన
కాకతీయ, చేర్యాల: సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి (జిల్లా జడ్జి) జి. సుదర్శన్ శనివారం చేర్యాల కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణ, న్యాయస్థానంలోని మౌలిక సదుపాయాలను పరిశీలించి, కోర్టు కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చేర్యాల కోర్టు న్యాయమూర్తి బానోతు శ్రీరామ్‌కు పెండింగ్‌లో ఉన్న పాత కేసులను వేగవంతంగా విచారించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి ఆదేశించారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెళ్ల వీరామల్లయ్య, ప్రధాన కార్యదర్శి మేరుగు రమేష్, న్యాయవాదులు అరెళ్ల మహేందర్, భూమిగారి మనోహర్, నీరటి రాజలింగం, పొన్నం సురేష్, డి. ప్రశాంత్, బి. ప్రసాద్, జనగామ జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

