అక్రమాలకు ”కల్లెం” పడేనా..?
సీసీ రహదారుల నిర్మాణాల్లో నాణ్యత కరువు
ప్రభుత్వ నిబంధనలు గాలికి.. నాసిరకం పనులతో కాంట్రాక్టర్ దందా
అధికార పార్టీ పేరుతో అధికారులకు మామూళ్లు
కాకతీయ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలో జరుగుతున్న సిసి రహదారుల నిర్మాణాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ, అధికారులకు ముడుపులు ముట్టజెప్పుతూ పనులను దక్కించుకుంటున్న ఓ కాంట్రాక్టర్ నాణ్యతను గాలికి వదిలేసి, నాసిరకం పనులతో తూతూమంత్రంగా పనులు పూర్తి చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు కాంట్రాక్టర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగి, ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా మారాడు. “నాకు పార్టీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి.. ఎన్నో పదవులు అనుభవించాను” అంటూ అధికారులను బెదిరిస్తూ, తమకు కావాల్సినట్లుగా పనులు చేయించుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో ఇతని వ్యవహారశైలి నచ్చక పెద్దలు పక్కన పెట్టినా, జిల్లా నాయకత్వంలో చోటు సంపాదించుకుని మండలంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. మండలంలోని పలువురు సర్పంచులను తన మాటలతో బురిడీ కొట్టించి, పనుల్లో తనిఖీలు లేకుండా చేసుకుంటున్నాడని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

జాడలేని పాలకవర్గం.. నిరసన బాట పట్టిన గ్రామస్థులు
ఇటీవల పోలేపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను పాలకవర్గం ప్రారంభించినా, ఆ తర్వాత పనులు నాణ్యతగా జరుగుతున్నాయా లేదా అన్నది ఏమాత్రం పట్టించుకోలేదు. కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నాణ్యత లేని రోడ్లు మాకు వద్దు” అంటూ శనివారం గ్రామస్థులు పనులను అడ్డుకోవడంతో కాంట్రాక్టర్ అక్కడి నుండి వెనుదిరగాల్సి వచ్చింది. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు స్థానిక పాలకవర్గం పర్యవేక్షించాల్సిన బాధ్యతను గాలికి వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల మౌనం.. ముడుపుల మత్తులో ఆరోపణలు
గత 20 ఏళ్లుగా అధికార పార్టీలో కీలక పదవులు అనుభవించానని, అధిష్టానంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులకు భయపెడుతూ.. నెలనెలా ముడుపులు చెల్లిస్తున్నాడని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పంచాయతీ రాజ్ అధికారులు ఈ నాసిరకం పనులను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ నిధులు వృథా కావడమే కాకుండా, త్వరలోనే రోడ్లు శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

