గంజాయి రవాణాను కట్టడి చేయాలి
నియంత్రణకు హోమ్‌గార్డ్ నుంచి డీజీపీ వరకు భాగస్వాములవ్వాలి
ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలకు రక్షణ కేంద్రంగా మారాలి
సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా
డీజీపీ సీవీ ఆనంద్
మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం
శాంతిభద్రతలు మరింత మెరుగు : ఎమ్మెల్యే పాయం
కాకతీయ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మల్టీ జోన్-2 ఐజీ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన భవనంలోని రిసెప్షన్, సీసీ కెమెరాల పర్యవేక్షణ గది, విచారణ గదులు, మహిళా డెస్క్ వంటి సౌకర్యాలను డీజీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ప్రజలకు స్నేహపూర్వక సేవలు అందించడమే పోలీసుల ప్రధాన విధి అని, స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. “ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలకు భరోసా కల్పించే రక్షణ కేంద్రంగా ఉండాలి. ప్రజల నమ్మకమే పోలీసు వ్యవస్థకు శ్రీరామరక్ష” అని ఆయన పేర్కొన్నారు.

గంజాయిపై ‘జీరో టాలరెన్స్’
ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులకు మణుగూరు దగ్గరగా ఉన్నందున గంజాయి రవాణా జరిగే ప్రమాదం ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ ఆదేశించారు. “రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా కట్టడి చేయాలనే లక్ష్యంతో హోమ్‌గార్డ్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలి. మత్తుపదార్థాల వల్ల యువత బలికాకుండా అవగాహన కల్పించడంతో పాటు, అక్రమ రవాణాదారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు.
శాంతిభద్రతలు మరింత మెరుగు : ఎమ్మెల్యే పాయం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతమైన మణుగూరులో అత్యాధునిక సౌకర్యాలతో పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల శాంతిభద్రతల పరిరక్షణ మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ భవనం ప్రజలకు మరింత పారదర్శకమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమం అనంతరం డీజీపీ పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతి భద్రతలు, నేరాల నియంత్రణపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

