ప్రజా ఫిర్యాదులు, లంచాల ఆరోపణలతో సస్పెన్షన్
కాకతీయ, ఇబ్రహీంపట్నం: అధికారిక విధుల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై. వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యం, రెవెన్యూ సేవల విషయంలో ప్రజల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులు, అక్రమ లంచాల ఆరోపణలు, ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అవకతవకలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ కఠిన చర్య తీసుకున్నారు. జిల్లా పరిపాలనకు అందిన నివేదికలు, విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాల ఆధారంగా తహసీల్దార్‌పై పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి.
ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారని, ప్రభుత్వ సేవల పారదర్శకతకు భంగం కలిగించారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. దివంగత కోటయ్య కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం జారీ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం జరిగినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వ సేవల విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రెవెన్యూ శాఖలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా అధికారులు హెచ్చరించారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

