- ఆర్డీవో ఆఫీసు ముందు రైతు నిరసన
- భూమి రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల నిర్లక్ష్యం
- కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు
- ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం శూన్యం
- అధికారుల నిర్లక్ష్యంతో పీకల్లోతు కష్టాల్లో మల్కపేట రైతు
కాకతీయ, వేములవాడ : జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మల్కపేట గ్రామానికి చెందిన ఒగ్గు రాజేశం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేములవాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ఆయన బైఠాయించి తన ఆవేదనను తెలియజేశారు. తన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నా, అధికారులు పట్టించుకోకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో నిరసన బాట పట్టానని ఆయన వాపోయారు. సర్వే నంబర్ 245లో ఉన్న తన 1.10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం గత కొన్ని నెలలుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా, సిబ్బంది కనీసం స్పష్టమైన సమాధానం కూడా ఇవ్వడం లేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రజావాణి ఆదేశాలు గాలికి.. యంత్రాంగంపై సర్వత్రా విమర్శలు
సమస్య పరిష్కారం కోసం బాధితుడు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు మొరపెట్టుకున్నారు. దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్, వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ అయి రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారులు మొండిగా వ్యవహరిస్తూ ఫైలును ముందుకు కదిలించడం లేదని బాధితుడు ఆరోపించారు. ప్రజావాణిలో ఇచ్చిన ఆదేశాలే అమలు కాకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే విలువ లేని చోట, సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

