- రెండోసారి కాంగ్రెస్ విజయం ఖాయం
- భద్రాచలం రాముడి సాక్షిగా శపథం చేస్తున్నా
- 20 ఎంపీ స్థానాలివ్వండి..రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం
- బీజేపీతో హరీష్ రావు చీకటి మంతనాలు
- దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
- మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేది కాంగ్రెస్ మాత్రమే
- 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ
- జగన్నాథపురం రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాకతీయ, ఖమ్మం బ్యూరో : తెలంగాణలో 2029లో జరగబోయే ఎన్నికల్లో 117 స్థానాలతో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు తనకు ప్రాణమైతే, ఖమ్మం జిల్లా తన గుండెకాయ వంటిదని కొనియాడారు. 2023 జూలైలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఖమ్మం ప్రజలు ఉప్పెనలా వచ్చి బీఆర్ఎస్ను బొంద పెట్టారని, ఇప్పుడు కూడా అదే జూలైలో సభకు భారీగా తరలివచ్చి బీఆర్ఎస్ పునరుజ్జీవనాన్ని అడ్డుకున్నారని అన్నారు.
2029లో రెండోసారి కాంగ్రెస్ విజయం
రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు 2028 డిసెంబరులో కాకుండా 2029 మే లేదా జూన్‌లో జరుగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అప్పటికి తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరుగుతాయని అంచనా వేశారు. ఈ 182 స్థానాల్లో 117 సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని భద్రాచలం రాములవారి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 26 పార్లమెంట్ స్థానాలకు గాను 20 స్థానాలు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందామని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌వి దొంగ సర్వేలు… నిప్పులు చెరిగిన సీఎం
కేసీఆర్, ఆయన సర్వే ఏజెన్సీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎన్నికలు ఎప్పుడో తెలియదు, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియదు కానీ, అప్పుడే కాంగ్రెస్ ఓడిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జూబ్లీహిల్స్‌లో కూడా ఇలాగే చెప్పి భంగపడ్డారని, ఇప్పుడు బీఆర్ఎస్ బ్యాడుమేళం బ్యాచ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని స్వయానా కేసీఆర్ చెల్లెలే చెబుతోందని, ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి ఆ పార్టీకి వందల కోట్లు అందాయని గుర్తు చేశారు. బీజేపీ నాయకులతో హరీష్ రావు రాత్రిపూట రహస్య మంతనాలు జరుపుతున్నారని, నిజంగా బీజేపీలోకి వెళ్లనని కేసీఆర్, హరీష్ రావు ఒట్టేసి చెప్పాలని సవాల్ విసిరారు.
రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
ప్రభుత్వం ఏర్పడిన 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం తెలిపారు. రైతు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామని, రైతు భరోసాను 12 వేలకు పెంచామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పథకాలను తాము కొనసాగిస్తూనే, పేదలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే నేటికీ రైతులకు నీరందిస్తున్నాయని, మేడిగడ్డ వంటి ప్రాజెక్టుల వల్ల భద్రాచలం రాముడు మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం స్పష్టం చేశారు. మధిరకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తామని భట్టి విక్రమార్క కోరిక మేరకు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కౌరవ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని స్పష్టం చేస్తూ, ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అని నినదించారు.

