- 23న టీఎస్‌జేయూ సే నో టు డ్రగ్స్ ర్యాలీ
- టీఎస్‌జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్
- పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
కాకతీయ, హనుమకొండ: మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ టీఎస్‌జేయూ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న సే నో టు డ్రగ్స్ నినాదంతో 2కే అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని టీఎస్‌జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆవిష్కరించారు. సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీఎస్‌జేయూ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ర్యాలీ విజయవంతం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారని ఆయన పేర్కొన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమని తోకల అనిల్ కుమార్ అభిప్రాయపడ్డారు.
టీఎస్‌జేయూ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ అవగాహన ర్యాలీలో యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ఈ నెల 23న నిర్వహించే 2కే ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జిల్లా కోశాధికారి సల్మాన్ ఖాన్, జిల్లా ప్రచార కార్యదర్శి అజీమ్ పాల్గొన్నారు.

