కాకతీయ, కొత్తగూడెం: అయోధ్య రామమందిరం హుండీ చోరీ మరియు విరాళాల అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న డిమాండ్ చేశారు. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు అధ్యక్షతన ఈ నెల 13న భద్రాచలంలో ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావు మౌన దీక్ష చేపట్టనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. మన ఆరాధ్య దైవమైన శ్రీరాముని పేరుతో జరుగుతున్న అక్రమాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తోట దేవి ప్రసన్న పేర్కొన్నారు. అయోధ్య మందిరంలో జరిగిన చోరీపై యోగి ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం, కేంద్ర ప్రభుత్వం అసమర్థతను చూపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడం దారుణమని ఆమె విమర్శించారు. దైవ ద్రోహులను శిక్షించడంలో పాలకులు ఎందుకు వెనకాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ అవినీతికి వ్యతిరేకంగా రాముని సాక్షిగా వీహెచ్ హనుమంతరావు చేపట్టే మౌన దీక్షకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, రామ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలపాలని ఆమె పిలుపునిచ్చారు.

