- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
కాకతీయ, చేర్యాల: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, ప్రతి గ్రామంలో ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ఫారాల నమోదును వేగవంతం చేయాలని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చేర్యాల పట్టణంలోని కళ్యాణి గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బూత్ స్థాయి ఏజెంట్లను అభినందిస్తూ, వారికి గ్రామ, మండల స్థాయి నాయకులు పూర్తిస్థాయిలో సహకరించాలని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు నమోదు ఫారం అందేలా చర్యలు తీసుకుని, నిర్దేశిత గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంజె మల్లేశం, కొమురవెల్లి మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, జిల్లా సమగ్ర ఓటరు సవరణ కో-ఆర్డినేటర్ మెడ శ్రీనివాస్, చెంచరపు కరుణాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ జక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

