ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే పాయం వినతి
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల బలోపేతానికి ప్రతిపాదనలు
సానుకూలంగా స్పందించిన మంత్రి
త్వరలో చర్యలు తీసుకుంటామన్న హామీ
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : పినపాక నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, వైద్య పరికరాలు మంజూరు చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. బుధవారం మంత్రిని కలిసి తన నియోజకవర్గంలోని ఆసుపత్రుల దుస్థితిని వివరించి వినతిపత్రం అందజేశారు. పినపాక ప్రాంతం గిరిజన, అటవీ, గ్రామీణ ప్రాంతాలతో కూడిన ప్రత్యేక నియోజకవర్గమని, వేలాది మంది పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడి ఉన్నారని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యులు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సుల కొరతతో పాటు మౌలిక వసతుల లేమి తీవ్రంగా వేధిస్తోందని ఆయన వాపోయారు.
సమగ్ర ప్రతిపాదనల అందజేత
ఈ మేరకు మణుగూరు 100 పడకల ఏరియా ఆసుపత్రి, బూర్గంపాడు సీహెచ్‌సీలతో పాటు మణుగూరు, గుండాల, కరకగూడెం, మొరంపల్లి బంజర, ఆళ్లపల్లి, జానంపేట పీహెచ్‌సీల అభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రతిపాదనలను ఎమ్మెల్యే మంత్రికి సమర్పించారు. ఈ ఆసుపత్రులన్నింటినీ ఆధునీకరించి, అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తేవాలని కోరారు. ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు, ఆయా ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాయంకు హామీ ఇచ్చారు.

