మంత్రులొస్తున్నారని గుంతలు పూడ్చారు
ఏళ్లుగా వాహనదారుల నరకం.. ఒక్కరోజులోనే పూడ్చివేత
తాత్కాలిక మరమ్మతులతో మమ అనిపించిన యంత్రాంగం
కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి : రాష్ట్ర మంత్రుల రాక ఖరారైతే చాలు.. అధికారులు నిద్రలేస్తారు! నెలల తరబడి వాహనదారులకు నరకం చూపిస్తున్న గుంతలను పూడ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తారు. తాజాగా మణుగూరులో మంత్రుల పర్యటన సందర్భంగా అధికారుల తీరు చూస్తుంటే.. ప్రజల కోసం కాకుండా, కేవలం మంత్రుల కంట పడకుండా భయం కోసమే ఈ పనులు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూలై 16న నలుగురు మంత్రులు మణుగూరుకు రానున్నారు. ఈ వార్త తెలియగానే ఏళ్ల తరబడి రోడ్ల దుస్థితిని పట్టించుకోని అధికార యంత్రాంగం ఒక్కసారిగా పరుగులు తీసింది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా, ఫిర్యాదులు చేసినా మొద్దునిద్ర పోయిన అధికారులు.. ఇప్పుడు మంత్రులు వచ్చి మందలిస్తారనే భయంతో కాంక్రీట్ మిక్సర్లతో గుంతలను కప్పేస్తున్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని అధికారులు, మంత్రుల పర్యటనంటే మాత్రం ఒక్క రోజులోనే రోడ్లను సిద్ధం చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల కోసం కాదు.. కేవలం ఫొటోల కోసం!
సామాన్యులు రోజూ ఈ రోడ్లపైనే ప్రయాణిస్తూ బైక్‌లు జారి పడిపోతున్నా, ఆటోలు-బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. కానీ మంత్రులు వస్తున్నారంటే చాలు.. యంత్రాలు, సిబ్బందిని దించి హడావుడి చేయడం వెనుక చిత్తశుద్ధి ఏమాత్రం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. “ఇది ప్రజల పట్ల బాధ్యత కాదు, పై అధికారుల తిట్లు, మంత్రుల అసహనం నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న నాటకం” అని వాహనదారులు మండిపడుతున్నారు.
శాశ్వత పరిష్కారం ఏదీ?
తాత్కాలిక మరమ్మతులతో ప్రజల కళ్లకు గంతలు కట్టడం మానుకోవాలని, శాశ్వతంగా రోడ్లను బాగు చేసి నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు వస్తున్నప్పుడు మాత్రమే కాకుండా, ప్రతిరోజూ ప్రజాసేవలో ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేస్తున్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.

