మూలవాగులో ఇసుక తవ్వకాలపై రైతుల ఆందోళన
నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని ఆగ్రహం
తాగునీటి బావి సమీపంలో భారీ యంత్రాలతో ఇసుక తరలింపు
భూగర్భ జలాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్న గ్రామస్థులు
రంగంలోకి దిగిన రెవెన్యూ, పోలీస్ అధికారులు
కాకతీయ, వేములవాడ : కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని మూలవాగులో జరుగుతున్న ఇసుక తవ్వకాలు శుక్రవారం ఉద్రిక్తతకు దారితీశాయి. గ్రామంలోని మూలవాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థానిక రైతులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గ్రామానికి తాగునీరు అందించే ప్రధాన బావి సమీపంలోనే భారీ యంత్రాలతో ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు తవ్వకాలను అడ్డుకున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు దెబ్బతిని, భవిష్యత్తులో తాగునీటి సమస్యతో పాటు వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఒక ప్రాంతానికి అనుమతులు మంజూరు చేసినప్పటికీ, వాటికి విరుద్ధంగా మరొక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపించారు. మూలవాగులో విచక్షణారహితంగా ఇసుకను తవ్వడం వల్ల భూగర్భ జలమట్టం క్షీణిస్తోందని, దీనివల్ల ప్రజలు తాగునీటికి, రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు.
అధికారుల జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి
వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేసి, నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు, గ్రామస్థులు ఇసుక రీచ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులతో మాట్లాడి వారి అభ్యంతరాలను విన్న అధికారులు, అంశాన్ని పూర్తిగా పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, అధికారులు చేపట్టే చర్యలపై గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

