ఆర్ఎంసీ ప్లాంట్‌పై మౌనమేలా..?
నిబంధనలను తుంగలో తొక్కిన జీఎస్ఆర్ సంస్థ
వాల్టా నిబంధనలకు తూట్లు పొడిచిన యాజమాన్యం
పంట పొలాల్లోనే అక్రమ ఆర్ఎంసీ ప్లాంట్లు
రెవెన్యూ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
అక్రమమని తెలిసినా చర్యలు తీసుకోని రెవెన్యూ అధికారులు
మంత్రి స్పందన కోసం నిరీక్షిస్తున్న అన్నదాతలు
కాకతీయ, మయూరి సెంటర్ : జాతీయ రహదారి నిర్మాణ పనుల పేరుతో జీఎస్ఆర్ ప్రైవేట్ కంపెనీ పంట పొలాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లు స్థానిక రైతుల పాలిట శాపంగా మారాయి. అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసినా, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నుంచి కురవి వరకు జరుగుతున్న జాతీయ రహదారి పనుల కోసం జీఎస్ఆర్ సంస్థ, కాచిరాజుగూడెం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి ‘నాలా’ అనుమతులు (ల్యాండ్ కన్వర్షన్) లేకుండానే ఆర్ఎంసీ ప్లాంట్లను నెలకొల్పింది. దీనివల్ల ప్లాంట్ పరిసరాల్లోని పంట పొలాలు, ఇళ్లు నిత్యం దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయి. ఈ అక్రమాలపై గత రెండు నెలలుగా రైతులు ఎంఆర్వో, భూగర్భ జల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు వ్రాతపూర్వక ఫిర్యాదులు అందించారు. అక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియో సాక్ష్యాలను సమర్పించినా, అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం మినహా ఇప్పటివరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అధికారుల ఈ ఉదాసీనత చూస్తుంటే, ప్లాంట్ యాజమాన్యానికి అధికార యంత్రాంగం అండదండలు మెండుగా ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
వాల్టా చట్టం ఏం చెబుతోంది?
ఆర్ఎంసీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి వాల్టా చట్టం, ల్యాండ్ కన్వర్షన్ రూల్స్ అత్యంత స్పష్టంగా ఉన్నాయి. వ్యవసాయ భూమిని నాన్-అగ్రికల్చర్ అవసరాలకు మార్చుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ నిర్మించకూడదు. కాలుష్య నియంత్రణ మండలి నుండి ఎన్ఓసీ పొందడం తప్పనిసరి. వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాలను వినియోగించుకునే విషయంలో ప్రత్యేక నిబంధనలు పాటించాలి. ఇన్ని చట్టపరమైన నిబంధనలు ఉన్నా, ఏ ఒక్కటి పాటించకుండానే ప్లాంట్లు నడుపుతుండటంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసారాన్ని నాశనం చేస్తున్న ఈ సంస్థపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మంత్రిగారు స్పందించండి.. రైతుల వేడుకోలు
ఈ అక్రమ ఆర్ఎంసీ ప్లాంటు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం పరిధిలో ఉంది. ప్రజా పాలనలో తమ సమస్యను పరిష్కరిస్తారని రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో, “ప్రజా పాలనలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. మంత్రిగారు దయచేసి స్పందించండి” అని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం మేల్కొని, నిబంధనలు అతిక్రమించిన సదరు సంస్థపై సీజ్ మరియు జరిమానా వంటి చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

