- అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ లేదు
- : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
- పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
- మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : అశ్వారావుపేటను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని, చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ఎక్కడా రాజీపడేది లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. సోమవారం అశ్వారావుపేట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత స్థానిక క్రీడా మైదానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, అక్కడ క్రీడాకారులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వసతుల తీరును అధికారులతో కలిసి సమీక్షించారు. యువతకు నాణ్యమైన క్రీడా వాతావరణాన్ని అందించేందుకు అథ్లెటిక్స్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ తదితర ఆటలకు అనువుగా మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మైదానంలో తాగునీరు, పారిశుధ్యం, సరైన లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ, విశ్రాంతి గదులతో పాటు ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాట్లను దశలవారీగా వేగవంతం చేయాలని సూచించారు.
నిర్దేశిత గడువులోగా సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలిక్రీడా మైదానం పరిశీలన అనంతరం పట్టణంలో కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు, అధికారులకు నిర్దేశించిన గడువులోగా వాటిని పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న ఈ లైటింగ్ వ్యవస్థ రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడంతో పాటు పట్టణానికి సరికొత్త శోభను తెస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

