కలం యోధులు గ్రేట్
అడవుల్లో మా కళ్లు జర్నలిస్టులే
జర్నలిస్టులకు పోలీస్ సహకారం ఎప్పుడూ ఉంటుంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
బక్కచింతలపాడులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవన ప్రారంభం
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : మారుమూల గిరిజన గూడాల్లో సిగ్నల్ లేకపోయినా, సరైన రోడ్డు సౌకర్యం లేకపోయినా వార్తలను సేకరించి బయట ప్రపంచానికి తెలియజేస్తున్న జర్నలిస్టులు ఎంతో గ్రేట్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రశంసించారు. బుధవారం చర్ల మండలం అటవీ ప్రాంత ఆదివాసీ గ్రామం బక్కచింతలపాడులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అక్కడ విలేకరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్క చిన్న సంఘటన కూడా సమాజంపై పెద్ద ప్రభావం చూపుతుందని, అలాంటి సమయాల్లో అత్యంత బాధ్యతతో, నిజాలను మాత్రమే రాస్తూ సమాజంలో శాంతిభద్రతలను కాపాడడంలో మీడియా పాత్ర కీలకమని సూచించారు. పోలీసు వ్యవస్థకు, గిరిజన ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సంఘటనా స్థలానికి పరుగెత్తి ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారని అభినందించారు.
జర్నలిస్టుల త్యాగం వెలకట్టలేనిది..
నక్సల్స్ భయం, వన్యమృగాల సంచార నీడలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిజాన్ని వెతికి తెచ్చే జర్నలిస్టుల త్యాగం మాటల్లో చెప్పలేనిదని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు శాఖ తరఫున మీడియాకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని, ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

