- జీసీసీ గ్యాస్ వ్యవహారంపై ఉన్నతాధికారుల మౌనం
- ఆధారాలతో సహా అక్రమాలు బయటకు వచ్చిన చర్యలేవీ..?
- అక్రమార్కులకు అధికారులు మద్దతు తెలుపుతున్నట్లేనా..?!
- చర్యలు తీసుకోవాలని వినియోగదారుల డిమాండ్

కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌పీ గ్యాస్ పంపిణీ వ్యవహారంలో అధికారిక ధరకు మించి వసూళ్లు, రసీదులు జారీ చేయకపోవడం, వ్యక్తిగత యూపీఐ ఖాతాలకు నగదు బదిలీలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికారిక విచారణ ప్రారంభం కాకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై జూలై 25న కాకతీయ దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైనప్పటికీ, సంబంధిత శాఖల నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాధనానికి, ప్రభుత్వ సంస్థల పారదర్శకతకు సంబంధించిన అంశంపై ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత వెంటనే వాస్తవాలను నిర్ధారించే చర్యలు చేపట్టాల్సి ఉండగా, జీసీసీ, హెచ్‌పీసీఎల్ లేదా జిల్లా యంత్రాంగం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆరోపణలపై విచారణ ప్రారంభించకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు.
అధికారిక ధరకు మించి అదనపు మొత్తాలు వసూలు చేశారా? ఆ మొత్తాలకు రసీదులు ఎందుకు ఇవ్వలేదన్న ఆరోపణల్లో వాస్తవమెంత? వ్యక్తిగత యూపీఐ ఖాతాలకు జరిగిన లావాదేవీల స్వరూపం ఏమిటి? వసూలైన మొత్తాలు అధికారిక లెక్కల్లో నమోదయ్యాయా? డెలివరీ సమయంలో తీసుకున్న నగదు, సంస్థ రికార్డుల్లో ఉన్న వివరాలు సరిపోతున్నాయా? వంటి ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లభించలేదు.
మౌనం వీడని అధికారులు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్యాస్ పంపిణీ వ్యవస్థపై ఆరోపణలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం వినియోగదారుల్లో అసంతృప్తిని పెంచుతోంది. కనీసం ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు కూడా సమాచారం లేకపోవడం, బాధ్యుల నుంచి వివరణ కోరినట్లు తెలియకపోవడం చర్చకు దారితీస్తోంది. ఆరోపణలు నిజమా? కాదా? అన్నది సమగ్ర విచారణ ద్వారానే తేలుతుందని స్థానికులు అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూళ్లు లేదా ఆర్థిక అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే… ఆరోపణలపై విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తారా? అనే అంశాలపై ప్రజలు సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు.

