- రెండో ప్రమాద హెచ్చరికతో అప్రమత్తం
- భద్రాచలంలో వరద పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన
- పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశాలు
- 24 గంటలు ఫ్లడ్ కంట్రోల్ రూమ్లు అందుబాటులో ఉంచాలని సూచన
- లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
- గోదావరిలోకి ఎవరినీ అనుమతించొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశం
- 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : “ప్రజల ప్రాణ రక్షణే తొలి ప్రాధాన్యం. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలి” అని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి శుక్రవారం వరద పరిస్థితులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట విస్తా కాంప్లెక్స్ స్లూయిస్ వద్ద వరద నీటి పారుదల పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, మోటార్ల పనితీరుపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు వేగంగా బయటకు వెళ్లేలా మోటార్లను నిరంతరం పనిచేసేలా చూడాలని, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
స్నానఘాట్ల వద్ద కట్టుదిట్టమైన నిఘా
అనంతరం కరకట్టపై నుంచి గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్, స్నానఘాట్ల వద్ద పరిస్థితిని సమీక్షించారు. గోదావరిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను అనుమతించవద్దని, ప్రమాదకర ప్రాంతాల వద్ద నిరంతర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 11,44,645 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోందని, నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఆలస్యం చేయకుండా పునరావాస కేంద్రాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.
24 గంటలు ఫ్లడ్ కంట్రోల్ రూమ్లు
వరద పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, 24 గంటల పాటు ఫ్లడ్ కంట్రోల్ రూమ్లు పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రతి గ్రామంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.

