చేర్యాలలో విషాదం..
మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత గౌడ్ కన్నుమూత
అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
ప్రజాసేవతో గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలికి నివాళులు
కాకతీయ, చేర్యాల : బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు, చేర్యాల మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత గౌడ్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో చేర్యాల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జడ్పీటీసీగా పనిచేసిన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకురాలిగా సరిత గౌడ్ గుర్తింపు పొందారు. ప్రజాసేవలో ఆమె చూపిన నిబద్ధతను పలువురు స్మరించుకున్నారు. సరిత గౌడ్‌కు భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు చదువుకుంటున్న సమయంలోనే తల్లి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

