మెఘా దొంగే..!
కాకతీయ రాసిన కథనాలు అక్షర సత్యాలు
అక్రమాలు జరిగింది వాస్తవం.. పన్నులు, జరిమానాలు కట్టింది వాస్తవం
ప్రభుత్వ ఖజనాకు చేరిన అక్షరాల 46లక్షలు
కాకతీయ వరుస కథనాలతో యంత్రాంగానికి తప్పని విచారణ
పరిశోధనాత్మకత సమాచారణ సేకరణతో మెఘా కుయుక్తులు వెలుగులోకి
కౌకొండ గుట్టల లెక్కలు… ఆర్టీఐతో బట్టబయలు!
మెఘాతో ఖజానాకు రూ.46 లక్షలు కట్టించిన కాకతీయ..!
కథనాల తర్వాతే వెలుగులోకి వచ్చిన ప్రభుత్వ చెల్లింపుల అధికారిక రికార్డులు
సమాచారం ఇవ్వొద్దన్న అభ్యంతరాలు… కమిషన్ ఆదేశాలతో బయటపడిన పత్రాలు
పర్మిట్ ఫీజు, ఎన్ఎస్ఎఫ్, ట్రస్ట్‌లకు చెల్లింపులపై స్పష్టమైన ఆధారాలు
అక్షర పోరాటానికి అధికారిక పత్రాలే సాక్ష్యాలుగా నిలిచిన ఘటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కౌకొండ గుట్టల తవ్వకాలపై కాకతీయ ప్రచురించిన వరుస పరిశోధనాత్మక కథనాలు మరోసారి అక్షర సత్యాలుగా నిలిచాయి. గుట్టల తవ్వకాల అనుమతులు, ప్రభుత్వానికి రావాల్సిన పర్మిట్ ఫీజులు, రాయల్టీలు, ఇతర చెల్లింపులపై కాకతీయ లేవనెత్తిన ప్రశ్నలతో అధికార యంత్రాంగం కదిలింది. అనంతరం జరిగిన విచారణల నేపథ్యంలో మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ప్రభుత్వ సంబంధిత ఖాతాలకు రూ.46,71,916 చెల్లించినట్లు అధికారిక రికార్డులు వెల్లడించాయి. ఈ వివరాలను ప్రజలకు అందకుండా నిలువరించేందుకు అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ… రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ట్రెజరీ చలాన్లు, బ్యాంకు లేఖలు, చెల్లింపు రికార్డులు వెలుగులోకి వచ్చాయి. మైనింగ్ పర్మిట్ ఫీజు, గ్రావెల్‌పై ఎన్ఎస్ఎఫ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్, స్టేట్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్‌లకు జరిగిన చెల్లింపులు అధికారిక పత్రాల్లో నమోదవడంతో… కౌకొండ గుట్టల తవ్వకాలపై కాకతీయ వెలుగులోకి తెచ్చిన అంశాలకు మరింత బలం చేకూరింది. ప్రజా సంపదకు సంబంధించిన లెక్కలను వెలికితీసిన కాకతీయ అక్షర పోరాటానికి ఈ అధికారిక రికార్డులే సాక్ష్యాలుగా నిలిచాయి.

కథనాలే కదిలించిన యంత్రాంగం…
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం పేరుతో హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గుట్టల్లో జరుగుతున్న తవ్వకాలపై మొదటిసారి కాకతీయ వరుస కథనాలు ప్రచురించింది. గుట్టలను ఏ అనుమతులతో తవ్వుతున్నారు..? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎంత..? పర్మిట్ ఫీజులు, రాయల్టీలు చెల్లించారా..? సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేశాయా..? అనే ప్రశ్నలను వరుస కథనాల్లో లేవనెత్తింది. ప్రజా సంపద వినియోగానికి సంబంధించిన లెక్కలు బహిర్గతం కావాలని డిమాండ్ చేసింది. ఈ కథనాల తర్వాత సంబంధిత శాఖల్లో కదలిక మొదలైంది. అధికార యంత్రాంగం దృష్టి కౌకొండ గుట్టల తవ్వకాలపై పడింది. ఇదే సమయంలో అధికారిక రికార్డులను వెలికితీసేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు.
సమాచారం అడ్డుకునే ప్రయత్నం… కమిషన్‌తో వెలుగులోకి నిజాలు
ఆర్టీఐ దరఖాస్తుల అనంతరం సమాచారం వెంటనే అందలేదు. మెఘా సంస్థ సమాచారం విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అధికారిక రికార్డులు వెల్లడించాయి. దీంతో వివరాలు బయటకు రాకుండా నిలిపివేయాలనే ప్రయత్నం జరిగింది. అయితే విషయం రాష్ట్ర సమాచార కమిషన్ ముందుకు వెళ్లింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సమాచారమని భావించిన కమిషన్… సంబంధిత రికార్డులను విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల అనంతరం గనుల శాఖ ట్రెజరీ చలాన్లు, బ్యాంకు లేఖలు, చెల్లింపు వివరాలను విడుదల చేసింది. అప్పటి వరకు ఫైళ్లకే పరిమితమైన పత్రాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ పరిణామమే మొత్తం వ్యవహారానికి కీలక మలుపుగా నిలిచింది.
పర్మిట్ ఫీజుగా రూ.17.62 లక్షలు… ఎన్‌ఎస్‌ఎఫ్‌గా రూ.22.03 లక్షలు
ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన ట్రెజరీ చలాన్ల ప్రకారం… 2026 జూన్ 8న ట్రెజరీ చలాన్ నంబర్ 6600970045 ద్వారా మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.17,62,987ను మైనింగ్ పర్మిట్ ఫీజు కింద ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది. చలాన్లో “Towards Permit Fee” అని స్పష్టంగా నమోదైంది. అదే రోజు ట్రెజరీ చలాన్ నంబర్ 6600970071 ద్వారా రూ.22,03,734ను గ్రావెల్‌పై ఎన్ఎస్ఎఫ్ (NSF) కింద ప్రభుత్వ ఖజానాకు చెల్లించినట్లు మరో అధికారిక పత్రం వెల్లడించింది. ఈ రెండు చెల్లింపులు కలిపి ప్రభుత్వ ఖజానాకు రూ.39,66,721 చేరినట్లు ట్రెజరీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ట్రస్ట్‌లకు మరో రూ.7.05 లక్షలు
ట్రెజరీ చలాన్లతో పాటు యూనియన్ బ్యాంక్ వరంగల్ బ్రాంచ్‌కు మెఘా పంపిన అధికారిక లేఖలు కూడా ఆర్టీఐ ద్వారా బయటపడ్డాయి. వాటి ప్రకారం… డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (DMFT), హనుమకొండకు రూ.6,61,120, స్టేట్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (SMET)కు రూ.44,075, ఎన్ఈఎఫ్టీ ద్వారా బదిలీ చేయాలని బ్యాంకును కోరింది. ఇందుకు సంబంధించిన చెక్కుల ప్రతులు కూడా అధికారిక రికార్డుల్లో ఉన్నాయి. ఈ రెండు మొత్తాలు కలిపి రూ.7,05,195 అవుతున్నాయి.
ప్రభుత్వ సంబంధిత ఖాతాలకు మొత్తం రూ.46.71 లక్షలు చేరాయి. ఆర్టీఐ ద్వారా లభించిన అధికారిక పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తే… మైనింగ్ పర్మిట్ ఫీజు – రూ.17,62,987, గ్రావెల్‌పై ఎన్ఎస్ఎఫ్ – రూ.22,03,734, డీఎంఎఫ్‌టీకి – రూ.6,61,120, స్టేట్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్‌కు – రూ.44,075
మొత్తంగా రూ.46,71,916 ప్రభుత్వ సంబంధిత ఖాతాలకు చెల్లించినట్లు అధికారిక రికార్డులు నిర్ధారిస్తున్నాయి. కౌకొండ గుట్టల వ్యవహారంపై కాకతీయ వరుస కథనాల అనంతరం ఈ చెల్లింపులకు సంబంధించిన రికార్డులు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అక్షర పోరాటానికి అధికారిక పత్రాలే ముద్ర
కౌకొండ గుట్టల వ్యవహారంలో కాకతీయ కేవలం ప్రశ్నలు లేవనెత్తి ఆగిపోలేదు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశంపై నిరంతర పరిశోధన సాగించింది. అధికార యంత్రాంగం స్పందించేలా చేసింది. చివరకు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారిక రికార్డులను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దాచిపెట్టాలనుకున్న లెక్కలు… ప్రభుత్వ ఖాతాలకు జరిగిన చెల్లింపులు… ట్రెజరీ చలాన్లు… బ్యాంకు లేఖలు… ఇవన్నీ ఇప్పుడు అధికారిక పత్రాల రూపంలో ప్రజల ముందున్నాయి. ప్రజా సంపదకు సంబంధించిన ప్రతి లెక్కను ప్రశ్నించే ధైర్యం, ఆ ప్రశ్నలకు ఆధారాలు సేకరించే పరిశోధనాత్మక దృక్పథం, వెలుగులోకి వచ్చిన అధికారిక రికార్డులు… ఇవన్నీ కలిపి కౌకొండ గుట్టల వ్యవహారాన్ని కాకతీయ అక్షర పోరాటానికి మరో మైలురాయిగా నిలిపాయి.

