ఎఫ్‌బీఓ నవీన్ మృతికి అటవీ సిబ్బంది సంతాపం
నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్
కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ) భానోత్ నవీన్ బలయ్యారు. బుధవారం బూర్గంపాడు మండలం నకిరిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన నవీన్ విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని విద్యుదాఘాతంతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగా వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చుకు బలికావడంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవీన్ మృతికి నిరసనగా, ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏటూరునాగారం ఫారెస్ట్ కాంప్లెక్స్‌లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది సంతాప కార్యక్రమం నిర్వహించారు. నవీన్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. అటవీ ప్రాంతాల్లో అక్రమంగా విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం, అటవీశాఖ కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలి
సింగరేణి మండలం వెంకట్యాతండాకు చెందిన మాజీ ఎంపీపీ భానోత్ దేవ్లా నాయక్ కుమారుడైన నవీన్ చెరువు సింగారం వెస్ట్ బీట్‌లో ఎఫ్‌బీఓగా విధులు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగానే ప్రాణాలు కోల్పోవడం పట్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వ్యక్తులను గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అటవీశాఖ సిబ్బంది కోరారు. కార్యక్రమంలో ఏటూరునాగారం డబ్ల్యూఎల్ఎం డీఎఫ్‌ఓ రమేష్, తాడ్వాయి డబ్ల్యూఎల్ఎం ఎఫ్‌ఆర్‌ఓ రమేష్, ఏటూరునాగారం దక్షిణం ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహ్మాన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్, ఏటూరునాగారం నార్త్ ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌ఓ అశోక్, మంగపేట ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌ఓ లాయక్ హుస్సేన్‌తో పాటు వివిధ రేంజ్‌ల డీవైఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు పాల్గొన్నారు. మిగిలిన రేంజ్‌ల సిబ్బంది పసరా ఫారెస్ట్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్నారు.

