జెండా తలకిందులుగా ఎగరేసిన దుగ్గొండి ఎమ్మార్వో
ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్
తహసీల్దార్ ముస్క సమ్మక్క తీరుపై విమర్శలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన ఘటన దుగ్గొండి మండల కేంద్రంలో చర్చనీయాంశమైంది. తహసీల్దార్ ముస్క సమ్మక్క జాతీయ జెండాను ఆవిష్కరించిన సమయంలో పతాకం తలకిందులుగా ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దుగ్గొండి మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది, స్థానికుల సమక్షంలో అధికారిక కార్యక్రమం నిర్వహించారు. నిర్ణీత సమయంలో తహసీల్దార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, అనంతరం పతాకం తలకిందులుగా ఉన్న విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ పతాకం విషయంలో ముందస్తుగా తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు ఈ అంశాన్ని ఎలా గుర్తించలేకపోయారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పతాకం దేశ సార్వభౌమత్వానికి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు ప్రతీక అని, దాన్ని ఎగురవేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరమని స్థానికులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు జెండాను ఎవరు సిద్ధం చేశారు, అధికారులు తనిఖీ చేశారా అనే అంశాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పతాకావిష్కరణ కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

