సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
బీఆర్ ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
తెలంగాణ భవన్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశం కోసం స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ప్రాణాలను సైతం త్యాగం చేయడం వల్లే నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని తాతా మధుసూదన్ అన్నారు. వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడంతో పాటు దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితోనే తెలంగాణ హక్కుల కోసం ఉద్యమం సాగిందన్నారు. దేశం, తెలంగాణ, ఖమ్మం జిల్లా శాంతిసుభిక్షాలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పగడాల నరేందర్ చేత పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

