కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు విడుదల చేయాలి
రైతు బీమా బకాయిలు చెల్లించాలి
ఏటూరునాగారంలో బీఆర్‌ఎస్ ఆందోళన
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రైతు బీమా పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు పిలుపు మేరకు ఎండీ ఖాజా పాషా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు నెలల తరబడి చెక్కులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. రైతు బీమా కింద మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందక అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన చేపడుతున్న ప్రతిపక్షాలను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
పెండింగ్‌లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు రైతు బీమా పరిహారాన్ని తక్షణమే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఏటూరునాగారం నుంచే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


