నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి శ్రావణమాస ప్రత్యేక పూజలు
కాకతీయ, గీసుకొండ: శ్రావణమాసం తొలి మంగళవారం సందర్భంగా మండలంలోని ఊకల్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన ఆచార్యులు స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి,వేద మంత్రోచ్ఛర ణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో, గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణమాసం తొలి మంగళవారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పుట్టలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
*ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం..
శ్రావణమాస తొలి మంగళవారం సందర్భంగా గీసుగొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, సామాజికవేత్త పెగళ్లపాటి లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అర్చకులు సముద్రాల సుదర్శన ఆచార్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కక్కెర్ల సుభాష్, ఎన్పీడీసీఎల్ డీడీ మల్లికార్జున్,గీసుగొండ వాస్తవ్యులు కర్ణకంటి రాంమూర్తి,ముల్క సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

