వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్‌లో ముసలం!
సీఎం రేవంత్‌కు సుస్మిత పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
బీసీలను అణగదొక్కుతూ.. అక్రమ కేసులు పెడుతున్నారు
కొండా దంపతుల తీరుతో పార్టీకి నష్టం
కొండా దంపతులను బర్తరఫ్ చేయాలి
కాంగ్రెస్ నేత నల్గొండ రమేష్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతూ.. అదే సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడు ఎదగకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేత నల్గొండ రమేష్ ఆరోపించారు. కొండా దంపతుల విధానంతో పార్టీకి నష్టం జరుగుతోందని, నాయకులకు నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుస్మిత పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ (రాంకీ) నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ, కొండా మురళి, సుస్మిత పటేల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.కొండా దంపతుల విధానంతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని నల్గొండ రమేష్ అన్నారు. బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండో బీసీ నాయకుడు ఎదగకుండా చేస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులకు నియోజకవర్గంలో తిరిగే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పక్కనపెట్టి ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీలను అణగదొక్కుతున్నారంటూ ఆరోపణలు
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుస్మిత పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ తూర్పులో బీసీలను తొక్కడమే కొండా దంపతుల పనిగా మారిందని ఆరోపించారు. బీసీ మహిళ అయి ఉండి బీసీలనే అణగదొక్కుతున్నారని విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి రౌడీషీట్లు ఓపెన్ చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసే వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
కొండా మురళికి ఏ హోదా ఉందని టికెట్లు ప్రకటిస్తారు?
మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్
“కొండా మురళికి ఏ హోదా ఉందని పరకాల టికెట్, కార్పొరేటర్ టికెట్లు ప్రకటిస్తారు? మీరెవరు ప్రకటించడానికి?” అని మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ (రాంకీ) ప్రశ్నించారు. క్రమశిక్షణ లేని వారు పార్టీలో ఉండకూడదని అన్నారు. మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బర్తరఫ్ వేడుకల కోసం తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొండా దంపతుల వ్యవహారం శాడిజాన్ని తలపిస్తోందని, కొట్టిస్తున్న వీడియోలు చూసి ఆనందిస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. వారితో ఉన్నవారు ప్రేమతో కాకుండా భయంతో ఉన్నారని అన్నారు. “మీది ఊపు కాదు.. వాపు” అని ఎద్దేవా చేశారు. కొండా దంపతులను బర్తరఫ్ చేస్తే వారి ఇంటి ముందు నలుగురు కూడా కనిపించరని ఘాటుగా వ్యాఖ్యానించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

