ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్ నవరాత్రులు
కులమతాలకు అతీతంగా ఒకే కుటుంబంగా వేడుకలు
భక్తితోపాటు సామాజిక బాధ్యతను చాటాలి
సేవా కార్యక్రమాలతో పండుగకు సార్థకత
బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ పిలుపు
కాకతీయ, హన్మకొండ : గణేశ్ నవరాత్రులు కేవలం పూజలు, ఉత్సవాలకు పరిమితం కాకుండా ఐక్యత, భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సామాజిక పండుగగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ అన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ ఒకే కుటుంబంగా కలిసిమెలిసి వేడుకలు నిర్వహించాలని, భక్తితోపాటు సామాజిక బాధ్యతను చాటేలా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హన్మకొండలోని పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హనుమాన్‌నగర్‌లో గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో గోపికృష్ణ పాల్గొని మాట్లాడారు. చిన్నా పెద్దా, పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా సోదరభావం, సామాజిక ఐక్యత బలపడతాయని అన్నారు. గణపతి ఉత్సవాలు యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు సామాజిక బాధ్యతను అలవాటు చేస్తాయని తెలిపారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయం వంటి కార్యక్రమాలు చేపట్టి సేవాభావాన్ని పెంపొందించాలని సూచించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సంప్రదాయాల విశిష్టతను భావితరాలకు అందించడంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించి, నిమజ్జన సమయంలో చెరువులు, జలాశయాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.




మండపాల్లో ప్రత్యేక పూజలు
పోచమ్మకుంటలోని శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్, హన్మకొండ హనుమాన్‌నగర్ సాగర కాలనీలోని శ్రీ గజానన ఉత్సవ కమిటీ, పోచమ్మకుంట ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండపాలను గోపికృష్ణ సందర్శించారు. హనుమాన్‌నగర్‌లోని కనకదుర్గ గజానన మండలి, ఓమ్ గణపతి యూత్ ఆధ్వర్యంలోని వేడుకల్లో పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేట గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కాలనీ పెద్దలు, మహిళలు, యువతను అభినందించారు. మహా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. గణేశ్ నవరాత్రులు ఐక్యతను చాటేలా, సేవాభావాన్ని పెంపొందించేలా జరగాలని ఆకాంక్షించారు.

