భక్తి పేరుతో అశాంతికి తావివ్వొద్దు
పగటి వేళల్లోనే నిమజ్జనం పూర్తి చేసుకోవాలి
శంకరపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్‌రెడ్డి సూచన
కాకతీయ, శంకరపట్నం: వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని శంకరపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్‌రెడ్డి మండల ప్రజలకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. అధిక శబ్దంతో డీజేలు, సౌండ్ సిస్టమ్‌లు వినియోగించవద్దని సూచించారు. వీలైనంత వరకు వెలుతురు ఉన్న సమయంలోనే నిమజ్జనం పూర్తి చేసుకోవాలన్నారు. నీటి వద్ద అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, యువత ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. మండపాల నిర్వాహకులు ముందుండి క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరేలా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. “భక్తితో జరుపుకుందాం.. జాగ్రత్తగా నిమజ్జనం చేద్దాం.. క్షేమంగా ఇంటికి చేరుకుందాం” అని ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

