రెబ్బెన గోదాం నుంచే రేషన్ దందా!
పట్టణ శివారులోనే భారీ స్టాకు పాయింట్
పీడీఎస్ బియ్యం తూకాలు.. ప్యాకింగ్ అక్కడే
చిన్న వ్యాపారులు, ఏజెంట్ల నుంచి చేరుతున్న రైస్
అవసరానికి తగ్గట్టుగా చుట్టు పక్కల ప్రదేశాల్లో స్టాక్ పాయింట్ల ఏర్పాటు
రాత్రివేళల్లో గోదాం నుంచి లారీల్లో తరలింపు
రైళ్లలోనూ మిల్లుల పేరుతో లోడింగ్..?
పదుల సంఖ్యలో ఏజెంట్లతో రేషన్ డాన్ భారీ నెట్‌వర్క్
స్మగ్లర్‌కు సలాం కొడుతున్న ఆఫీసర్లపై ఉత్తరం కాకతీయకు సమాచారం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న పీడీఎస్ బియ్యం దందాపై వరుసగా వెలుగులోకి వస్తున్న సమాచారం కలకలం రేపుతోంది.అసిఫాబాద్‌కు చెందిన రేషన్ డాన్.. రెబ్బెన పట్టణ శివారులోని ఓ గోదాం నుంచే వ్యవహారం నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిన్న వ్యాపారులు, పీడీఎస్ కలెక్షన్ ఏజెంట్లు తాము సేకరించిన బియ్యాన్ని విడతలవారీగా ఈ గోదాంకు చేరుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ స్టాక్‌ను తూకం వేసి సంచుల్లో నింపడం.. రాత్రివేళల్లో లారీలకు లోడ్ చేసి సరిహద్దులు దాటించడం జరుగుతున్నట్లు సమాచారం. లారీలతోపాటు కొన్ని సందర్భాల్లో మిల్లుల పేరుతో రైళ్లలోనూ బియ్యం లోడింగ్ చేస్తున్నట్లు తెలుస్తుండటంతో వ్యవహారం ఏ స్థాయిలో విస్తరించిందని తెలుస్తుండటం విస్తుగొల్పుతోంది. మరోవైపు ప్రధాన గోదాంకు స్టాక్ చేరకముందే చిన్న మొత్తాల్లో నిల్వ చేసేందుకు పలు ప్రాంతాల్లో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం.
గోదాంలోనే తూకాలు.. ప్యాకింగ్
రెబ్బెన పట్టణ శివారులోని గోదాంలో పీడీఎస్ బియ్యం చేరిన తర్వాత తూకం వేసి సంచుల్లో నింపుతున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే స్టాక్‌ను ఒకచోట చేర్చి, అవసరానికి అనుగుణంగా లారీలకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పగటి సమయంలో పెద్ద మొత్తంలో కదలికలు లేకుండా, రాత్రివేళల్లో వాహనాలను సిద్ధం చేసి తరలించే విధానం కొనసాగుతున్నట్లు సమాచారం. గోదాంకు వచ్చే స్టాక్, అక్కడి నుంచి బయటకు వెళ్లే వాహనాల వివరాలను పరిశీలిస్తే వ్యవహారం వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రధాన గోదాం ఒక్కటే కాకుండా రేషన్ డీలర్లు, పీడీఎస్ కలెక్షన్ ఏజెంట్లకు అనువుగా చిన్న మొత్తాల్లో బియ్యం నిల్వ చేసే పాయింట్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో స్టాక్ సమకూరిన తర్వాత పరిస్థితిని బట్టి రెబ్బెన శివారులోని గోదాంకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకేసారి పెద్ద మొత్తంలో బియ్యం ఒకచోట కనిపించకుండా విడతలవారీగా తరలింపు సాగుతున్నట్లు సమాచారం. ఈ పాయింట్లు ఎక్కడున్నాయి? వాటిలో ఎంత స్టాక్ నిల్వ చేస్తున్నారు? ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? అనే వివరాలు బయటకు వస్తే నెట్‌వర్క్ విస్తృతి స్పష్టమయ్యే అవకాశం ఉంది.
మిల్లును వదిలి.. ఏజెంట్ల వ్యవస్థ
గతంలో సదరు రేషన్ స్మగ్లర్ ఓ మిల్లును లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ మిల్లును వదిలేసి పదుల సంఖ్యలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్టాక్ సేకరణ బాధ్యతలను ఏజెంట్లకు అప్పగించి, అవసరమైనప్పుడు వాటిని ప్రధాన గోదాంకు చేరుస్తున్నట్లు సమాచారం. దీంతో ఒకే కేంద్రం నుంచి మొత్తం వ్యవహారం నడిపిన పాత విధానానికి బదులుగా విస్తృత ఏజెంట్ నెట్‌వర్క్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ ఏజెంట్ల వివరాలు, వారి ఆధీనంలోని స్టాక్ పాయింట్లు, గోదాంకు పంపుతున్న పరిమాణాలపై సివిల్ సప్లైస్ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
రాత్రి వేళకు లోడింగ్ సిద్ధం..
గోదాంలో తూకం, ప్యాకింగ్ పూర్తయిన తర్వాత రాత్రివేళల్లో లారీలకు బియ్యం లోడ్ చేస్తున్నట్లు సమాచారం. పగటిపూట సేకరణ, నిల్వ ప్రక్రియ సాగుతుండగా రాత్రివేళల్లో రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. లారీల రాకపోకలు, లోడింగ్ సమయాలు, వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు, గోదాం పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకే ప్రాంతం నుంచి నిరంతరంగా వాహనాలు కదులుతున్నట్లయితే వాటిపై సంబంధిత శాఖలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయన్నది ప్రశ్నగా మారుతోంది.
లారీల ద్వారా మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో మిల్లుల పేరుతో రైళ్లలోనూ బియ్యం లోడింగ్ చేసి మహారాష్ట్రలోని చంద్రపూర్, బల్లార్షా ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. సిర్పూర్ నుంచి రైళ్ల ద్వారా రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మిల్లుల పేరుతో రవాణా చేస్తున్నట్లయితే సంబంధిత మిల్లుల స్టాక్ రిజిస్టర్లు, రవాణా అనుమతులు, బిల్లులు, లోడింగ్ వివరాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. వాస్తవంగా ఏ మిల్లుకు సంబంధించిన బియ్యం? పీడీఎస్ స్టాక్ ఎలా ఆ సరఫరా గొలుసులోకి చేరింది? అనే అంశాలపై రికార్డుల ఆధారంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
సహకారం ఎవరిది?
రెబ్బెన శివారులో గోదాం, దానికి అనుసంధానంగా చిన్న స్టాక్ పాయింట్లు, వాటి నుంచి బియ్యం సేకరించే ఏజెంట్లు, అక్కడి నుంచి రాత్రివేళల్లో రవాణా.. ఇలా దశలవారీ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం వస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల నిఘా ఎంతవరకు ఉందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ముఖ్యంగా రేషన్ డీలర్ల స్థాయిలో బియ్యం సేకరణ, మధ్యంతర స్టాక్ పాయింట్లు, ప్రధాన గోదాం, లారీ లోడింగ్, రైలు రవాణా వరకు ప్రతి దశలో రికార్డులను పరిశీలించాల్సి ఉంది. సదరు స్మగ్లర్‌కు గతంలో సహకరించని పోలీసులను ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్నతస్థాయి పోలీసు అధికారులతోనూ సంబంధాలు ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే ఈ అంశాన్ని అధికారికంగా నిర్ధారించే ఆధారాలు అందుబాటులో లేవు. అయినప్పటికీ ఒకవేళ పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యం రవాణా జరుగుతున్నట్లయితే పోలీసు శాఖకు చెందిన నిఘా విభాగాలు, స్థానిక పోలీసులు ఇప్పటివరకు గుర్తించిన వివరాలేమిటన్నది ప్రశ్న. గోదాం, వాహనాలు, రాత్రివేళల్లో జరిగే కదలికలపై సమాచారం ఉన్నా చర్యలు ఎందుకు కనిపించడం లేదన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది.
సివిల్ సప్లైస్ అధికారుల నిఘా ఎక్కడ?
పీడీఎస్ బియ్యం సేకరణ, నిల్వ, తరలింపు మొత్తం వ్యవహారం సివిల్ సప్లైస్ శాఖ పరిధిలోనూ కీలకంగా ఉంటుంది. రేషన్ డీలర్ల వద్ద పంపిణీ రికార్డులు, లబ్ధిదారులకు అందిన పరిమాణం, మిగిలిన స్టాక్, ఏజెంట్ల కదలికలు, గోదాం వద్ద జరుగుతున్న తూకాలు, ప్యాకింగ్ వంటి అంశాలను పరస్పరం సరిపోల్చితే లెక్కల్లో తేడాలు బయటపడే అవకాశం ఉంది. రెబ్బెన శివారులోని గోదాం, అనుమానిత స్టాక్ పాయింట్లపై తనిఖీలు చేపట్టి వాస్తవ పరిస్థితిని అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. కేవలం పట్టుబడిన బియ్యంతోనే వ్యవహారాన్ని ముగించకుండా, సేకరణ నుంచి తుది రవాణా వరకు ఉన్న గొలుసును ఛేదించాల్సి ఉంది.
ఉత్తరం కాకతీయకు ఫోన్లు.. కీలక సమాచారం
రేషన్ డాన్ వ్యవహారంపై ఉత్తరం కాకతీయకు పలువురు ఫోన్ చేసి తమకు తెలిసిన వివరాలను వెల్లడించడం గమనార్హం. రెబ్బెన శివారులోని గోదాం, అక్కడ జరిగే తూకాలు, స్టాక్ పాయింట్లు, ఏజెంట్ల వ్యవస్థ, రాత్రివేళల్లో జరిగే లోడింగ్ వంటి అంశాలను వారు వివరించారు. స్మగ్లర్‌కు ఎవరి నుంచి సహకారం అందుతోంది? ఎవరు అతడి నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు? అనే వివరాలను కూడా తమకు తెలిసిన మేరకు పంచుకున్నారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కొత్త సమాచారం ప్రకారం పీడీఎస్ బియ్యం దందాలో ప్రధానంగా కనిపిస్తున్నది రెబ్బెన శివారులోని గోదాం, దానికి అనుసంధానమైన చిన్న స్టాక్ పాయింట్లు, వాటిని కలుపుతున్న ఏజెంట్ల వ్యవస్థతో పక్కా నెట్వర్క్‌ను స్మగ్లర్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూడు దశలపై సమగ్ర తనిఖీ జరిగితేనే దందా అసలు పరిమాణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. గోదాంలో తూకం వేసిన బియ్యం ఎంత? ఏ ప్రాంతాల నుంచి వచ్చింది? ఎవరెవరు తెచ్చారు? ఎన్ని వాహనాల్లో బయటకు వెళ్లింది? రైళ్లలో ఏ పేరుతో లోడింగ్ చేశారు? అన్న రికార్డులను అధికారులు పరిశీలించాల్సి ఉంది. యథేచ్ఛగా సాగుతున్నట్లు వస్తున్న సమాచారానికి తెరదించాలంటే పోలీసు, సివిల్ సప్లైస్ శాఖలు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అసలు గోదాం నుంచి బయటకు వెళ్తున్న ప్రతి సంచి లెక్క తేలితేనే.. ఈ దందా వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్ ఎంత పెద్దదో స్పష్టమవుతోంది.

