కార్మిక పక్షపాతి వినయ్ భాస్కర్‌పై దాడి దారుణం
దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
మెడికో లీగల్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలి
ప్రత్యక్ష సాక్షులు, వీడియోలు, ఆధారాలను పరిశీలించాలి
పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలి
రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా దర్యాప్తు జరపాలి
మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసంపల్లి సంజీవ
కాకతీయ, హన్మకొండ : ప్రజా నాయకుడు, కార్మిక పక్షపాతి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్‌పై జరిగినట్లు పేర్కొంటున్న దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసంపల్లి సంజీవ కోరారు. ప్రజాప్రతినిధిపై దాడి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. దాస్యం వినయ్ భాస్కర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల నివేదికతోపాటు మెడికో లీగల్ నివేదికను పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని సంజీవ కోరారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించి అసలు ఏం జరిగిందో నిర్ధారించాలని సూచించారు.
కార్మికులతో సుదీర్ఘ అనుబంధం
కార్మిక వర్గంతో వినయ్ భాస్కర్‌కు సుదీర్ఘ అనుబంధం ఉందని సంజీవ గుర్తు చేశారు. ప్రణయ భాస్కర్ నుంచి 30 ఏళ్లుగా అనేక కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న ఆదర్శ నాయకుడిగా వినయ్ భాస్కర్ గుర్తింపు పొందారని అన్నారు. కార్మిక రంగంతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తించి దాడి ఘటనపై సమగ్రంగా విచారణ జరపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లపాటు ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా పోరాడారని సంజీవ గుర్తు చేశారు. మానవ సంబంధాలతో కూడిన పాలన, ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన, శాంతియుత వాతావరణం తెలంగాణ సమాజానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రజాప్రతినిధులపై దాడులు జరిగాయని ఫిర్యాదులు రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఆధారాలు ఉంటే బాధ్యులపై చర్యలు
వినయ్ భాస్కర్‌పై జరిగినట్లు పేర్కొంటున్న ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను స్పష్టంగా నిర్ధారించాలని సంజీవ కోరారు. విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా ఆధారాలు బయటపడితే వారికి వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా బాధితుడి వాంగ్మూలం, వైద్య నివేదిక, మెడికో లీగల్ నివేదికతోపాటు అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద శ్రీధర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మడికొండ బాబు, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జిలకర స్వామి, రాష్ట్ర అధికార ప్రతినిధి మామిడాల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చీకటి కుమార్, గుండా రమేష్, పసునూరి బాబు, నాయకులు భానోతు శంకర్‌నాయక్, కందికొండ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

