తప్పుడు ప్రచారం చేస్తే మహిళలే కొడతరు
వరంగల్ అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తాం
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు
111 మందికి రూ.61.61 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తన కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తే తన దగ్గర ఉన్న మహిళలే ఉరికిచ్చి కొడతారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు క్యాంపు కార్యాలయంలో మంగళవారం 111 మంది లబ్ధిదారులకు రూ.61,61,200 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల వచ్చిన నాయకులు గాల్లో కత్తులు తిప్పుతున్నారని వ్యాఖ్యానించారు. ఎంజీఎంలో బీఆర్‌ఎస్ నేతలు కావాలనే తొక్కిసలాట చేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పదవి పోయినా బాధ లేదని, అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే 8 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నూతన కలెక్టరేట్ ప్రారంభిస్తామని, కాంట్రాక్టర్ డబ్బుల కోసం పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ దేవాలయాల అభివృద్ధికి బీజేపీ నేతలు కేంద్రం నుంచి నిధులు తేవాలని, ఫోర్ట్‌లో బయటపడిన 11 దేవాలయాలను కేంద్ర సహకారంతో అభివృద్ధి చేయాలని అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 99 శాతం దేవాలయాలకు తమే నిధులు ఇచ్చామని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 24 కార్పొరేటర్ స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. వారంలో ఒకరోజు ‘డివిజన్ బాట’ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సర్వే జరుగుతోందని, అర్హులైన పేదలు, జర్నలిస్టులకు ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు.

