పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ
విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచన
కాకతీయ, వెంకటాపురం: ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామంజాపూర్లోని ఏహెచ్ఎస్ బాలికల పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వారి విద్యా ప్రగతి, బోధనా విధానం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల విద్యా రికార్డులను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నాణ్యమైన విద్యతోపాటు క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సమస్యలు, అవసరమైన సదుపాయాలపై సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన విద్యా అవకాశాలు, సదుపాయాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

