మేడారంలో ‘ప్యారడైజ్’ చిత్ర బృందం
సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు
నాని, సంపూర్ణేశ్‌బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ సందర్శన
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలను ‘ప్యారడైజ్’ సినిమా చిత్ర బృందం మంగళవారం సందర్శించింది. హీరో నాని, నటుడు సంపూర్ణేశ్‌బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌తో పాటు చిత్ర బృందం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ‘ప్యారడైజ్’ సినిమాలో నాని తల్లి పాత్రకు సమ్మక్క అనే పేరు ఉండటం, సమ్మక్క పేరుతో రూపొందించిన పాటకు మంచి స్పందన లభించడంతో చిత్ర బృందం మేడారం సందర్శనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా నాని తదితరులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. చిత్ర బృందం మేడారం వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నానిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపడంతో మేడారం సందడిగా మారింది.

