బీజేపీ కార్యాలయం నిర్మాణంపై వివాదం
సర్వే నంబర్ 978లో భూ హక్కులపై ఫిర్యాదులు
కోర్టులో కేసులు ఉండగానే నిర్మాణంపై వీరయ్య అభ్యంతరం
అక్రమ నిర్మాణమంటూ జీడబ్ల్యూఎంసీ అధికారులకు వినతులు
ప్రజావాణి నుంచి రెవెన్యూ అధికారులకు చేరిన వ్యవహారం
క్షేత్రస్థాయి పరిశీలనకు కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు
విచారణ బాధ్యతలు సిటీ ప్లానర్ రవీంద్ర డి. రెడేకర్‌కు అప్పగింత
కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణం చుట్టూ భూవివాదం తెరపైకి వచ్చింది. హంటర్ రోడ్డులోని సింగరేణి లేబర్ కాలనీ సమీపంలో సర్వే నంబర్ 978కు సంబంధించిన స్థలంలో బీజేపీ పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టడంపై కె. వీరయ్య అధికారులను ఆశ్రయించారు. సదరు భూమికి సంబంధించి కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో నిర్మాణం చేపట్టడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల్లో కోరారు. ఈ అంశంపై హనుమకొండ జిల్లా ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదును రెవెన్యూ డివిజనల్ అధికారికి పంపగా.. మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సైతం ఫిర్యాదును పరిశీలనకు తీసుకుని క్షేత్రస్థాయి తనిఖీకి ఆదేశించింది. దీంతో స్థలానికి సంబంధించిన హక్కులు, కోర్టు వ్యవహారాలు, నిర్మాణ అనుమతులపై అధికారుల పరిశీలనకు ప్రాధాన్యం ఏర్పడింది.
భూమి వివాదంలో ఉండగానే నిర్మాణం
కె. వీరయ్య సమర్పించిన ఫిర్యాదుల్లో హంటర్ రోడ్డుకు సమీపంలోని సింగరేణి లేబర్ కాలనీ పరిధిలోని సర్వే నంబర్ 978 భూమిని ప్రస్తావించారు. ఈ స్థలంలో బీజేపీ పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతోందని, అయితే భూమికి సంబంధించి వివాదం కొనసాగుతోందని పేర్కొన్నారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలానికి సంబంధించిన హక్కులు, రికార్డులు, నిర్మాణానికి సంబంధించిన అనుమతులను అధికారులు పరిశీలించాలని కోరారు. సదరు భూమికి సంబంధించి ఓఎస్ నంబర్ 1186/2017 కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని కె. వీరయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి తోడు ఓఎస్ నంబర్ 5/2026 కేసు కూడా కొనసాగుతోందని తెలిపారు. కోర్టు వివాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రస్తుత దశ, సంబంధిత ఆదేశాలు ఏమిటన్నది పరిశీలించాలని అధికారులను కోరారు. కోర్టు కేసులు కొనసాగుతున్న భూమిపై నిర్మాణం చేపట్టిన అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్‌డీవో పరిధిలోకి అంశం..!
ఈ వ్యవహారంపై కె. వీరయ్య హనుమకొండ జిల్లా ప్రజావాణిని ఆశ్రయించినట్లు అక్‌నాలెడ్జ్‌మెంట్ పత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ఒక ఫిర్యాదుకు డీహెచ్‌ఎన్‌కేయూ24082600057 అనే గ్రీవెన్స్ గుర్తింపు సంఖ్యతో 24 ఆగస్టు 2026 తేదీ నమోదై ఉంది. అందులో సర్వే నంబర్ 978కు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు పేర్కొన్నారు. మరో ఫిర్యాదుకు డీహెచ్‌ఎన్‌కేయూ21092600083 అనే గుర్తింపు సంఖ్యతో 21 సెప్టెంబర్ 2026 తేదీ ఉంది. ఇందులో హనుమకొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు అక్‌నాలెడ్జ్‌మెంట్‌లో నమోదైంది. ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదును పరిష్కారం కోసం హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారికి పంపినట్లు ప్రభుత్వ అక్‌నాలెడ్జ్‌మెంట్ పత్రంలో పేర్కొన్నారు. దీంతో సర్వే నంబర్ 978కు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, భూమి స్వభావం, హక్కులు, అందుబాటులో ఉన్న పత్రాలు తదితర అంశాలపై రెవెన్యూ శాఖ పరిశీలనకు అవకాశం ఏర్పడింది. ఫిర్యాదుదారు ప్రస్తావించిన కోర్టు కేసుల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితి కూడా పరిశీలనలోకి వచ్చే అంశంగా మారింది.
జీడబ్ల్యూఎంసీ క్షేత్రస్థాయి తనిఖీ
ఇదే అంశంపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట సర్కిల్-2 డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి కూడా ఫిర్యాదు అందింది. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారికి పంపినట్లు డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఇంటిమేషన్ లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదులో లేవనెత్తిన అంశాలను వివరంగా పరిశీలించాలని, అవసరమైన చోట క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించాలని అధికారిని ఆదేశించారు. అమల్లో ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుని నిర్ణీత సమయంలో ఫిర్యాదును పరిష్కరించాలని సూచించారు. అంతేకాకుండా తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి నేరుగా తెలియజేయడంతోపాటు, వ్యవహారం పరిష్కారమైన వెంటనే చర్యల నివేదికను డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ పత్రం ప్రతిని హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు సమాచారం కోసం పంపినట్లు కూడా లేఖలో ఉంది.
సిటీ ప్లానర్ రవీంద్ర డి.రెడేకర్‌కు విచారణ బాధ్యతలు
జీడబ్ల్యూఎంసీ ఫిర్యాదుపై చేపట్టాల్సిన పరిశీలనకు సంబంధిత అధికారిగా సిటీ ప్లానర్ రవీంద్ర డి. రెడేకర్ పేరును పేర్కొంది. క్షేత్రస్థాయి తనిఖీలో స్థల పరిస్థితి, మున్సిపల్ రికార్డులు, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం తీసుకున్న చర్యలపై చర్యల నివేదికను డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంది. దీంతో సర్వే నంబర్ 978 భూమికి సంబంధించిన రికార్డులు, కోర్టు కేసుల పరిస్థితి, నిర్మాణ అనుమతులపై అధికారుల పరిశీలనలో ఏం తేలుతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. చర్యల నివేదిక వెలువడిన తర్వాతే ఫిర్యాదులో లేవనెత్తిన అంశాలపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

