వాగ్దేవి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో మహంకాళి శ్యాంసుందర్ ఫిర్యాదు
కులం పేరుతో దూషించారంటూ ఆరోపణలు
కాకతీయ, వరంగల్ : కులం పేరుతో దూషించి, మానసిక వేధింపులకు గురిచేశారంటూ వాగ్దేవి ఒకేషనల్ జూనియర్ కళాశాల (అంబాల క్రాస్) యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మహంకాళి శ్యాంసుందర్ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. ఉర్సు కరీమాబాద్‌కు చెందిన తాను గతంలో ఇప్పకాయల రమేష్, అనిల్‌తో కలిసి వాగ్దేవి ఒకేషనల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశానని తెలిపారు. కళాశాల లావాదేవీల్లో ముగ్గురికి సమాన వాటా ఉంటుందని ఒప్పందం చేసుకుని, సమానంగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. అయితే అనిల్, రమేష్ ఇద్దరూ కలిసి తనను కళాశాల నుంచి బయటకు పంపించి, అప్పులు తనపై మోపారని ఆరోపించారు. ప్రస్తుతం ఉపాధి కోసం ఎంజీఎం ఒకేషనల్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నట్లు తెలిపారు. అప్పు చెల్లించాలంటూ అనిల్, రమేష్ మానసికంగా వేధిస్తున్నారని, ఈ క్రమంలో ఈ నెల 10న తాను పనిచేస్తున్న కళాశాల వద్దకు వచ్చి గొడవకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. తనను కులం పేరుతో దూషించిన అనిల్, రమేష్‌పై, వాగ్దేవి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మహంకాళి శ్యాంసుందర్ కోరారు.

