గుట్టు బయటపడింది.. యుద్ధం మొదలైంది!
ఏనుమాముల మార్కెట్లో కొనుగోళ్ల బంద్కు వ్యాపారుల నిర్ణయం
లింగారెడ్డిపై కేసుతో రగిలిన వ్యాపార వర్గాలు
సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని ఛాంబర్ తీర్మానం
తనిఖీల్లో తూకం, హమాలీ, ఈ-నామ్ నిబంధనల ఉల్లంఘనలు
ఆదివారం కలెక్టర్ నిర్ణయంపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో తనిఖీలతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు ఇప్పుడు కొనుగోళ్ల బంద్ వరకు వెళ్లాయి. ప్రభుత్వం నియమించిన లక్ష్మణుడి బృందం ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించిన క్షుణ్ణ పరిశీలనలో తూకం, హమాలీ, ఈ-నామ్ లావాదేవీల్లో ఉల్లంఘనలు గుర్తించింది. వాటి ఆధారంగా మార్కెట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో వ్యాపారులు, అధికారుల మధ్య వివాదం మొదలైంది. తాజాగా వ్యాపారి లింగారెడ్డిపై పెనుమాముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో వ్యవహారం మరింత ముదిరింది. సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీర్మానించింది.

బీట్ వద్ద మొదలైన వివాదం.. కార్యదర్శి వరకు కొనసాగింపు
పరిశీలన అనంతరం నోటీసులు జారీ కావడంతో మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. పత్తి బీట్ వద్ద జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజుతో వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వ్యాపారి లింగారెడ్డి అధికారిని ఉద్దేశించి మాట్లాడిన తీరు, హెచ్చరికలు చేసినట్లు కనిపిస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. మార్కెట్కు ఎవరైనా రావచ్చని, ఎవరినీ అడ్డుకునే అధికారం లేదని డీఎంఓ నాగరాజు స్పష్టం చేయగా, బీట్ కాల్ చేసే అంశంపై లింగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్తోనూ వాగ్వాదం చోటుచేసుకుంది. ‘మార్కెట్ మాది.. నీవు ఎక్కడి నుంచి వచ్చావు.. నోటీసులు ఇవ్వొద్దంటే ఎందుకు ఇస్తున్నావు’ అంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో లింగారెడ్డిపై పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
తనిఖీల్లో బయటపడిన అక్రమాలు
వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ నవంబర్ 10న జారీ చేసిన నోటీసులు, నవంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించిన పరిశీలన ఆధారంగా ఇచ్చినవే. వాటిలో పేర్కొన్న మూడు ఘటనలు మార్కెట్లో జరుగుతున్న ఉల్లంఘనలను స్పష్టం చేస్తున్నాయి.
కేకే ట్రేడర్స్: లక్ష్మి వెంకటేశ్వర ట్రేడింగ్ కంపెనీ వద్ద రూ.432, శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ వద్ద రూ.210 తూకంలో తేడా గుర్తించారు. ఈ రెండు లావాదేవీల్లో కలిపి రూ.642 వ్యత్యాసం నమోదైంది.
గుండు అగయ్య ఏజెన్సీ: ఈ-నామ్లో నమోదు చేయకుండా, వేబ్రిడ్జిపై తూకం వేయకుండా వ్యాపారం నిర్వహించారు. హమాలీ పని చేయకుండానే రూ.490 అదనంగా వసూలు చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు.
కామాచి ట్రేడర్స్: ఈ-నామ్ నమోదు లేకుండా, వేబ్రిడ్జి తూకం చేయకుండానే వ్యాపారం నిర్వహించారు. తక్కపట్టీ నంబర్లు 6305/72, 73, 77లను నోటీసులో ప్రస్తావించారు. ఈ మూడు వ్యవహారాలనూ తెలంగాణ వ్యవసాయ మార్కెట్ నియమావళి–1969లోని నిబంధన 52(బి), మార్కెట్ బైలా నంబరు 25 ఉల్లంఘనల కింద పేర్కొన్నారు.
మరో నాలుగు అంశాల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు
పరిశీలనలో గన్నీ బ్యాగుల ఛార్జీలపై అడ్డీ కమిషన్ పేరుతో రెండు శాతం వసూలు చేయడం, లూజ్ వాహనాల్లో వచ్చిన మొక్కలు/పత్తికి హమాలీ ఛార్జీలు వసూలు చేయడం, మిర్చి బస్తాల బరువు 49 కిలోలు దాటితే అర కిలో కటింగ్ మినహాయింపు ఇవ్వడం, మార్కెట్ యార్డుకు రాని సరుకుకు కూడా తక్పట్టి జారీ చేయడం వంటి మరో నాలుగు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
సోమవారం నుంచి కొనుగోళ్లు బంద్..!
లింగారెడ్డిపై కేసు నమోదు కావడంతో వ్యాపారులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సమావేశమైన వ్యాపారులు సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని తీర్మానించారు. ఏనుమాముల మార్కెట్ వైపు వెళ్లవద్దని కూడా వ్యాపారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మార్కెట్కు పత్తి తీసుకొచ్చే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.
ఆదివారం కలెక్టర్ ఏం తేల్చనున్నారు..?
ఈ వివాదంపై జిల్లా కలెక్టర్ ఆదివారం తీసుకునే నిర్ణయంపై మార్కెట్ వర్గాల దృష్టి నెలకొంది. తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలు, అధికారులు జారీ చేసిన నోటీసులు, వ్యాపారుల అభ్యంతరాలు, పోలీసు కేసు, కొనుగోళ్ల నిలిపివేత నిర్ణయం.. ఇలా అన్ని అంశాలపై కలెక్టర్ సమీక్షించే అవకాశం ఉంది. నిబంధనల అమలుతోపాటు రైతులకు కొనుగోళ్లలో అంతరాయం కలగకుండా చూడటం కీలకం కానుంది. కలెక్టర్ నిర్ణయంతో సోమవారం ఏనుమాముల మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగుతాయా, నిలిచిపోతాయా అన్నది తేలనుంది.

