కేశవపట్నంలో యూత్ భవనం
మహిళా కళా సంఘం ఏర్పాటు చేయాలి
సంబంధిత స్థలాలను కేటాయించాలని
న్యూ వింగ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం గ్రామంలో యువత అభివృద్ధి కోసం యూత్ భవనం, మహిళల కోసం మహిళా కళా సంఘం ఏర్పాటు చేసేందుకు మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థలాలను కేటాయించాలని న్యూ వింగ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కేశవపట్నం గ్రామంలో యువత, మహిళల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యూత్ భవనం, మహిళా కళా సంఘం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. గ్రామంలో ఎస్సీ, బీసీ కాలనీలకు చెందిన యువత, మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు. గతంలో గ్రామంలో సుమారు 60 మహిళా కుల సంఘాల కట్టడాలు నిర్మించినప్పటికీ, 1986 నుంచి ఇప్పటివరకు మహిళల కోసం ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్, గ్రంథ ముట్టా కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలు ఏర్పాటు కాలేదని తెలిపారు.యువతకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు మహిళా సంఘాలకు భవనాలు నిర్మిస్తే గ్రామంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు. ఈ సమస్యను అధికారులు పరిశీలించి, యూత్ భవనం, మహిళా కళా సంఘం ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కేటాయించి సహకరించాలని న్యూ వింగ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బక్కీ రాజు, కత్తేరమల్ల ఉదయ్ కిరణ్,ఫని కుమార్, ప్రణదీప్, తదితరులు పాల్గొన్నారు.

