రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి సంపత్ కుమారుడు చల్లూరి సాయి వరుణ్ (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి వరుణ్ పని నిమిత్తం ఈ నెల 20వ తేదీన టీజీ 02 ఏ 5350 నంబర్ గల ద్విచక్ర వాహనంపై మెట్పల్లి గ్రామానికి వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మధ్యాహ్నం సుమారు 1.15 గంటల సమయంలో మెట్పల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఏపీ 21 టీబీ 0999 నంబర్ గల లారీ అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సాయి వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి తండ్రి చల్లూరి సంపత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

